సామాన్యుడు ఇమేజ్‌తో వైరల్ అవుతున్న వైసీపీ ఎమ్మెల్యే

సామాన్యుడు ఇమేజ్‌తో వైరల్ అవుతున్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ ఎమ్మెుల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు ఏపీలో ఇప్పుడు హాట్ టాపిగ్గా మారుతోంది. ఎన్నికల్లో మంగళగిరి నుంచి నారా లోకేశ్‌పై పోటీ చేసి గెలిచిన ఆయన అత్యంత సాధారణ జీవితం గడుపుతుంటారు. ఎన్నికల వేళ, ఆ తరువాత కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి పొలం పనులు చేస్తున్న చిత్రాలు వైరల్ అయ్యాయి. తాజాగా ఆయన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో సాధారణ బోగీలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీంతో ఆ బోగీలో ఉన్న ఇతర ప్రయాణికులు ఎమ్మెల్యేను గుర్తించి ఆయనతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో ఆయన సింప్లిసిటీ మరోసారి చర్చనీయమైంది.

బేగంపేట నుంచి గుంటూరుకు పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఆళ్ల తన ప్రయాణం గురించి ట్వీట్ చేశారు కూడా. పల్నాడు ఎక్స్ ప్రెస్ లో బేగంపేట నుంచి గుంటూరుకు వచ్చానని..  రైలులో గురజాలలోని తంగెడ గ్రామానికి చెందిన దాదాపు 50 మంది యువకులు తనకు పరిచయం అయ్యారని అందులో వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ సీఎం కావాలనీ వీరంతా మొక్కుకున్నారనీ, ఇప్పుడు మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళుతున్నట్లు వారంతా చెప్పారని పేర్కొన్నారు. ఇలాంటివారు ఏపీలో చాలామంది ఉన్నారని ఆర్కే అన్నారు.

కాగా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ను మంగళగిరిలో ఓడించడంతో పాటు అంతకుముందు రాజధాని రైతుల కోసం ఆయన చేసిన న్యాయపోరాటాలు కూడా ఆళ్లకు గుర్తింపు తెచ్చాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే అయినప్పటికీ పొలంలో పనులు చేయడం వంటి చర్యలతో ఆయన జనం మనిషిగా పేరు తెచ్చుకున్నారు. జగన్ కేబినెట్లో ఆయనకు స్థానం దొరుకుతుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English