గుండెలు పిండేయబోతున్న చిరు

గుండెలు పిండేయబోతున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి రెండేళ్లుగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకే అంకితమై ఉన్నారు. ఎట్టకేలకు ఆ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఈ మెగా ప్రాజెక్టు కోసం చాలా సమయం పెట్టేసిన చిరు.. తర్వాతి సినిమాను మాత్రం చకచకా కానిచ్చేయాలనుకుంటున్నారు. అందుకోసం పక్కాగా స్కెచ్ రెడీ అయింది కూడా. ఆయన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో తన తర్వాతి సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. మామూలుగా ఆరు నెలల్లో స్క్రిప్టు రెడీ చేసే కొరటాల.. చిరు చిత్రానికి మాత్రం దాదాపు ఏడాది సమయం స్క్రిప్టుకే కేటాయించాడు. చిరు అందుబాటులోకి రాకపోవడం వల్ల మరింత జాగ్రత్తగా కథాకథనాల్ని తీర్చిదిద్దుకునే అవకాశం దక్కింది. ఇప్పుడు బౌండ్ స్క్రిప్టుతో కొరటాల రెడీగా ఉన్నాడట. కొరటాల ఇప్పటిదాకా చాలా మంచి సినిమాలే తీశాడు. వాటన్నింటికీ మించి చిరు సినిమా ఉంటుందని అంటున్నారు సన్నిహితులు.

ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తాడని.. ఒకటి రైతు పాత్ర అని, ఇంకోటి ఎన్నారై క్యారెక్టర్ అని సమాచారం. ముఖ్యంగా ఇందులో రైతు పాత్ర సినిమాకే హైలైట్‌గా ఉంటుందట. చాలా హృద్యంగా, సమకాలీన పరిస్థితుల్ని ప్రతిబింబించేలా ఈ పాత్రను డిజైన్ చేశాడట కొరటాల. ‘మహర్షి’లో మాదిరి వ్యవసాయం గురించి పైపైన లాగించేయకుండా.. ఇందులో రైతుల సమస్యలను లోతుగా చర్చిస్తారట. కానీ సినిమా మాత్రం కమర్షియల్ స్టయిల్లోనే ఉంటుందని అంటున్నారు.

కొరటాల ఏ ఎమోషన్లనైనా కొంచెం లోతుగానే చెబుతాడు. అవి హృదయానికి హద్దుకునేలా ఉంటాయి. అలాగని క్లాసులు పీకడు. ఎంటర్టైన్మెంట్ మిస్ కాడు. చిరు సినిమా విషయంలోనూ అదే స్టైల్ ఫాలో అవుతున్నాడట. ఎమోషన్లు పండించడంలో చిరు దిట్ట. చాన్నాళ్ల తర్వాత ఆయన కన్నీళ్లు పెట్టించే పాత్ర చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఆగస్టు 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English