ఆ ప‌ద‌వా...వ‌ద్దేవ‌ద్దంటున్న వైసీపీ నేత‌లు

ఆ ప‌ద‌వా...వ‌ద్దేవ‌ద్దంటున్న వైసీపీ నేత‌లు

రాజ‌కీయాల్లో కొన్ని సెంటిమెంట్లు భ‌లే ఆశ్చ‌ర్యంగా ఉంటాయి. స‌ద‌రు అంశంలో వాస్తవం ఎంత ఉంద‌నే విష‌యం ఎవ‌రు ఖ‌చ్చితంగా చెప్ప‌లేక‌పోయిన‌ప్ప‌టికీ...అవి అలా చెలామ‌ణి అయిపోతుంటాయి. స‌రిగ్గా ఇప్పుడు స్పీక‌ర్ ప‌ద‌వి విష‌యంలో అదే జ‌రుగుతోంది. అటు ఉమ్మ‌డి రాష్ట్రం అయినా...ఇటు ప్ర‌త్యేక తెలంగాణ‌, న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో అయినా...స్పీక‌ర్ ప‌ద‌వి అంటే నేత‌లు జంకుతున్నారు. 1999కు ముందు సంగతెలా ఉన్నా, ఆ తర్వాత స్పీకర్లుగా పని చేసినవారెవ్వరూ తదుపరి ఎన్నికల్లో గెలవలేదు. దీంతో గడచిన రెండు దశాబ్దాల పరిణామాలను, చరిత్రను ఆకళింపు చేసుకున్న ఎంఎల్ఎలు తమకు స్పీకర్‌ పదవి వద్దంటే వద్దంటున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు, సభాపతి పదవిని మాత్రం తీసుకోబోం అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. జూన్‌ 8న మంత్రి మండలిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టారు. పలు సమీకరణాల నేపథ్యంలో తమకు ఆప్తులైన, ఈ పదేళ్లల్లో తన వెన్నంటే నడిచిన కొందరు సీనియర్లకు మంత్రి పదవి ఇవ్వడం కుదరకపోవడంతో స్పీకర్‌ పదవిని ఇచ్చి సంతృప్తి పర్చాలని, సేవలకు గుర్తింపునిచ్చి గౌరవించాలని జగన్‌ యోచిస్తున్నట్లు సమాచారం. జూన్‌ మూడవ వారంలో నూతన అసెంబ్లీ కొలువుదీరనున్నందున స్పీకర్‌, డిప్యూటి స్పీకర్‌ పదవులపైనా సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే, ఈ ప‌ద‌వి త‌మ‌కు ఎక్క‌డ క‌ట్ట‌బెడ‌తారో అంటూ...సీనియ‌ర్ల‌లో ఆందోళ‌న మొద‌లైంద‌ని స‌మాచారం.

రాజకీయ, సామాజిక, జిల్లాల సమీకరణాల్లో మంత్రి పదవులు ఇవ్వలేని పరిస్థితుల్లో సీనియర్‌ ఎంఎల్ఎలకు స్పీకర్‌, డిప్యూటి స్పీకర్‌, ప్రభుత్వ విప్‌ పదవులను పార్టీల అధిష్టానాలు ఇవ్వజూపడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, స్పీక‌ర్ ప‌ద‌వి ద‌క్కితే ఇక పొలిటిక‌ల్ కెరీర్ క్లోజ్ అనే ట్రెండ్ న‌డుస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 1999లో టీడీపీ గెలుపొందగా అప్పుడు కె ప్రతిభా భారతి సుమారు నాలుగేళ్లకుపైగా స్పీకర్‌గా పని చేశారు. తదుపరి 2004 ఎన్నికల్లో ఆమె ఓటమిని చవి చూశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకొచ్చింది. అప్పుడు కెఆర్‌ సురేష్‌రెడ్డి స్పీకర్‌గా పని చేశారు. అనంతరం 2009లో కాంగ్రెస్‌ సర్కారే అధికారంలోకొచ్చినప్పటికీ ఎంఎల్ఎగా సురేష్‌రెడ్డి ఓడిపోయారు. 2009 జూన్‌లో ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్‌ బాధ్యతలు చేపట్టి సుమారు ఏడాదిన్నర పాటు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం ఆయనకు సీఎం పదవి దక్కినప్పటికీ రాష్ట్ర విభజన మూలంగా కాల వ్యవధి కంటే ముందే పదవికి రాజీనామా చేశారు. 2014లో కాంగ్రెస్‌ను వీడి జైసమైక్యాంధ్ర పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ తర్వాత పెద్దగా రాజకీయాల్లో కనిపించలేదు. 2014లో నవ్యాంధ్రలో స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాదరావు మొన్న ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. కాంగ్రెస్‌ హయాంలో కిరణ్‌కుమారెడ్డి తర్వాత స్పీకర్‌గా పని చేసిన నాదెండ్ల మనోహర్‌ విభజన ఆందోళనలను ఎదుర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్‌ నుంచి జనసేనలో చేరి మొన్న ఎన్నికల్లో పోటీ చేసినా అపజయం వెంటాడింది.

తెలంగాణాలోనూ స్పీకర్‌ సెంటిమెంట్‌ వదిలిపెట్టలేదు. తెలంగాణ తొలి స్పీకర్‌గా పని చేసిన మధుసూదనాచారి సైతం గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని చెబుతున్నారు. గతంలో 1994 నుంచి 1999 వరకు స్పీకర్‌గా పని చేసిన యనమల రామకృష్ణుడు 1999లో గెలిచి మంత్రి అయినప్పటికీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. దీంతో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. గడచిన రెండు దశాబ్దాల్లో చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేసుకుంటున్న వైసీపీి సీనియర్లు స్పీకర్‌ పదవి అంటే భయపడుతున్నారు. వైసీపీ నేతలు భ‌యం నేప‌థ్యంలో..వైఎస్ జ‌గ‌న్ ఈ ప‌ద‌వి ఎవ‌రికి క‌ట్ట‌బెడ‌తారో వేచి చూడాల్సిందే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English