లెక్క తేలుస్తామంటూ కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌!

లెక్క తేలుస్తామంటూ కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌!

ప‌వ‌ర్ మ‌హిమ ఇలానే ఉంటుంది. నిన్న (గురువారం) ఉద‌యం వ‌ర‌కూ ఆయ‌న ఎంపీ కిష‌న్ రెడ్డి. ఇప్పుడు ఆయ‌న కేంద్ర హోం శాఖ స‌హాయ‌మంత్రి. ప‌వ‌ర్ చేతికి వ‌చ్చినంత‌నే మాట ఎంత‌లా మారిపోతుంద‌న‌టానికి కిష‌న్ రెడ్డి వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నం. గురువారం ఉద‌యం తన‌కు కేంద్ర‌మంత్రి ప‌ద‌వి వ‌చ్చింద‌న్న వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంద‌ని.. ఆ స‌మాచారంలో నిజం లేదంటూ మీడియాకు మెసేజ్ లు పంపిన ఆయ‌న‌కు మ‌ధ్యాహ్నానానికి సీన్ మొత్తం మారిపోయింది.

పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా నుంచి స్వ‌యంగా వ‌చ్చిన ఫోన్ కాల్ తో  మొత్తం మారిపోయింది. హైద‌రాబాద్ నుంచి హుటాహుటిగా ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లిన కిష‌న్ రెడ్డి.. రాత్రికి కేంద్ర‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌టం.. ప‌క్క రోజు మ‌ధ్యాహ్నానానికి కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రిగా మారిపోవ‌టంతో సీన్ మొత్తం మారిపోయింది.
త‌న‌కు కేటాయించిన శాఖ‌కు సంతోషం వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నేష‌న‌ల్ సిటిజ‌న్ రిజిస్ట‌ర్ త‌యారీ మీద ప్ర‌ధానంగా దృష్టి సారిస్తామ‌ని.. ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు సంబంధించి ముఖ్య‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

అంతేకాదు.. ఎవ‌రు ప‌డితే వారు దేశంలో అక్ర‌మంగా ఉండ‌టానికి భార‌త‌దేశ‌మేమీ ధ‌ర్మ‌స‌త్రం కాదంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న‌..  భార‌తీయులు ఎవ‌రు?  చొర‌బాటుదారులు ఎవ‌ర‌న్న విష‌యంపై లెక్క త్వ‌ర‌లో తేలుస్తామ‌న్నారు. ఉగ్ర‌వాద ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగినా దాని మూలాలు హైద‌రాబాద్ లో ఉంటున్నాయ‌ని.. భాగ్య‌న‌గ‌రిని సేఫ్ జోన్ గా చేసుకుంటార‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉగ్ర‌వాదులకు సహ‌క‌రిస్తున్న వారిని శాశ్వితంగా ఏరివేస్తామ‌న్న కిష‌న్ రెడ్డి వ్యాఖ్య‌లు ఇప్పుడు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంటున్నాయి.

దేశ స‌మ‌గ్ర‌త‌.. ఐక్య‌త‌..భ‌ద్ర‌త త‌మ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని.. తాను బీజేవైఎం అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు సీమా సుర‌క్ష పేరుతో 25 రోజుల పాటు యాత్ర చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. మామూలు కిష‌న్ రెడ్డి నోటి నుంచి ప్రాధాన్య‌త ఉండ‌దు కానీ.. ఇప్పుడాయ‌న కేంద్ర హోం శాఖ స‌హాయ‌మంత్రి. చూస్తుంటే.. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే దిశ‌గా కిష‌న్ రెడ్డి ఇప్పుడు అడుగులు వేస్తున్నార‌న్న భావ‌న క‌లిగేలా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English