పార్లమెంటులో టీఆర్ఎస్ ఒంటరైందా ?

పార్లమెంటు శీతాకాల  సమావేశాలను బహిష్కరించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. పార్లమెంట్ ఈనెల 23వ తేదీన ముగుస్తున్న విషయం తెలిసిందే. బాయిల్డ్ రైస్ కొనాలని, పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలనే డిమాండ్లతో గడచిన వారంరోజులుగా పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ లోక్ సభ+రాజ్యసభ ఎంపీలు రకరకాలుగా ఆందోళనలు చేశారు. అయితే వీళ్ళ ఆందోళనలను, డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఇదే విషయమై మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ఆందోళనలను  కేంద్రం పట్టించుకోవడం లేదు కాబట్టే తాము పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలని డిసైడ్ అయినట్లు రాజ్యసభ ఎంసీ కే కేశవరావు చెప్పారు. ఇక్కడే టీఆర్ఎస్ నిర్ణయం కరెక్టేనా అనే డౌటు పెరిగిపోతోంది. ఎందుకంటే తమ ఆందోళనను కేంద్రం పట్టించుకోకపోతే ఏకంగా పార్లమెంటు సమావేశాలనే బహిష్కరించటం సబబేనా ? పార్లమెంటు సమావేశాలను ఎంపీలు బహిష్కరించటం వల్ల ఎవరికి ఉపయోగం ? ఎవరికి నష్టం ?  

పార్లమెంటులో రాష్ట్రంలోని సమస్యలను వినిపించాల్సిన బాధ్యత ఎంపీలపైనే ఉంటుంది. అలాంటిది ఎంపీలే పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తామంటే అర్ధమేంటి ? మిగిలిన పార్టీల ఎంపీలను కూడా మద్దతుతీసుకుని తమ వాణిని మరింత బలంగా వినిపించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీపైనే ఉంది. కానీ జరిగింది చూస్తుంటే పార్లమెంటులో టీఆర్ఎస్ ఒంటరైందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. కేంద్రాన్ని నిలదీసే విషయంలో ఇతర పార్టీల ఎంపీల సహకారం తీసుకోవాలని స్వయంగా కేసీయార్ ఆదేశించారు.

ప్రతిపక్షాలతో టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడారా ? మాట్లాడితే వాళ్ళేమన్నారు ? మద్దతు దొరకని కారణంగానే తమ ఆందోళనలను టీఆర్ఎస్ ఎంపీలు విరమించుకున్నారా ? అనే ప్రశ్నలకు ఎంపీలు లేదా కేసీయారే సమాధానం చెప్పాలి. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కేసీయార్ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అయితే బాయిల్డ్ రైస్ ను కొనేది లేదని  కేంద్రం ఎప్పుడో చెప్పేసింది.  ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ఎంపీలు టీఆర్ఎస్ కు మద్దతుగా నిలబడినట్లు కనిపించటంలేదు.

పార్లమెంటులో ఎంతసేపు టీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే ఆందోళన చేస్తు కనిపించారు. అంటే ప్రతిపక్షాల్లో ఏ పార్టీ కూడా టీఆర్ఎస్ కు మద్దతుగా నిలవలేదని అర్ధమైపోతోంది. దాంతో ఇక లాభం లేదని అర్ధమైపోయే  తమ ఆందోళనను విరమించుకున్నారు. పనిలో పనిగా పార్లమెంటుకు హాజరై కామ్ గా కూర్చోలేరు కాబట్టి ఏకంగా పార్లమెంటు సమావేశాలనే బహిష్కరించాలని డిసైడ్ అయ్యారు.