జై జూనియర్ ఎన్టీఆర్.. వర్మ మొదలెట్టేశాడు

జై జూనియర్ ఎన్టీఆర్.. వర్మ మొదలెట్టేశాడు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న ఆందోళనలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. చంద్రబాబుకు 70వ పడికి చేరువవుతుండటం, నారా లోకేష్ ఏమాత్రం సత్తా చాటుకోలేకపోవడం, బాబు తర్వాత నాయకత్వ ఆశలే కనిపించకపోవడంతో తెలుగుదేశం భవితవ్యం ప్రమాదంలో పడింది. ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఆ పార్టీని కాపాడగలడన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ పెద్ద స్థాయి వ్యక్తులెవరూ ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పడం లేదు.

ఐతే వివాదాల వీరుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ట్విట్టర్లో జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ రచ్చ మొదలుపెట్టేశాడు.
తెలుగుదేశం పార్టీని నిలబెట్టగల సత్తా ఉన్నది ఎన్టీఆర్ మనవడైన జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే అని వర్మ అభిప్రాయపడ్డాడు. ఎన్టీఆర్‌కు తన తాత మీద ఏమాత్రం గౌరవం ఉన్నా.. ఆయన పెట్టిన పార్టీని బతికించేందుకు ముందుకు రావాలని, తెలుగుదేశం పగ్గాలు చేపట్టాలని వర్మ పిలుపునిచ్చాడు. ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పగ్గాలు చేపడితే ఆ పార్టీకి ఎదురైన ఘోర పరాభవాన్ని అందరూ మరిచిపోతారని వర్మ అన్నాడు. ఈ సందర్భంగా మరోసారి చంద్రబాబుపై తనదైన శైలిలో వర్మ సెటైర్లు వేశాడు.

ఆయన పేరెత్తకుండా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అంటూ బాబును ఎద్దేవా చేశాడు. అలాగే ఆయన కొడుకు తెలుగుదేశం పార్టీకి ముందు పోటు పొడుస్తున్నాడంటూ నారా లోకేష్‌ను సైతం లైన్లోకి తెచ్చాడు. ఈ ట్వీట్లు అయ్యాక ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందని భావిస్తున్నారా అంటూ వర్మ ఒక పోల్ కూడా మొదలుపెట్టేయడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English