భీమవరంకి మకాం మార్చనున్న పవన్‌?

భీమవరంకి మకాం మార్చనున్న పవన్‌?

గాజువాక, భీమవరం నియోజికవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన జనసేనాని పవన్‌కళ్యాణ్‌ గాజువాకలోనే వుంటా అనే నమ్మకం కలిగించడం కోసం అక్కడో ఇల్లు అద్దెకి తీసుకున్న సంగతి విదితమే. భీమవరంలో గెలిస్తే అక్కడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటానని పవన్‌ కళ్యాణ్‌ అక్కడి ప్రజలకి హామీ ఇచ్చాడు. రెండు చోట్లా అనూహ్య పరాజయం చవిచూసిన పవన్‌కళ్యాణ్‌ భీమవరంలోనే మళ్లీ పోటీ చేయడానికి సుముఖంగా వున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. భీమవరంలో ఓడినా కానీ ఇక్కడ సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుని స్థానికుడి ఫీలింగ్‌ తెచ్చుకోవాలని పవన్‌ ఆలోచిస్తున్నాడట. మొగల్తూరు మొనగాడిగా పిలుచుకునే చిరంజీవితో పాటు ముగ్గురు కొణిదెల సోదరులకి ఈ పరిసరాల్లోనే ఓటమి ఎదురు కావడం గమనార్హం.

చిరంజీవి పాలకొల్లు అసెంబ్లీ నియోజికవర్గం నుంచి ఓడిపోతే, పవన్‌ భీమవరం అసెంబ్లీ నుంచి, నాగబాబు నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. స్వస్థలంగా చెప్పుకుంటున్నా ఎప్పుడూ అటుకేసి వెళ్లడం కానీ, ఆ ఊరికి ఏదైనా చేయడం కానీ చేయలేదని వీరిపై స్థానికంగా ఆరోపణలున్నాయి. అభిమానులు మెండుగానే వున్నా వ్యతిరేకత కూడా ఎక్కువ వుండడంతో పాటు స్థానికులు కాదనే వాదన ఎక్కువగా వినిపించడంతో దానిని కౌంటర్‌ చేయడానికి భీమవరంలో స్థిర చిరునామా ఏర్పరచుకోవడంతో పాటు తన ఐడెంటిటీ కార్డులు, ఓటర్‌ కార్డు కూడా అటు షిఫ్ట్‌ చేయాలని పవన్‌ యోచిస్తున్నాడట. మరి ఇందులో నిజమెంత అనేది జనసేనాని వేసే తదుపరి అడుగులని బట్టి తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English