బన్నీ.. అసలు పోలికుందా?

మేకోవర్ల విషయానికి వస్తే ఎప్పుడూ తమిళ హీరోలే ఆదర్శంగా నిలుస్తుంటారు. ఒక సినిమాలో ఎంతో స్టైలిష్‌గా కనిపించి.. ఇంకో సినిమాకు గుర్తు పట్టలేని రగ్డ్ లుక్స్‌లోకి మారడం వారికే చెల్లుతుంది. కమల్ హాసన్, విక్రమ్, సూర్య లాంటి హీరోలు పాత్రల కోసం ఎలా మారిపోతుంటారో.. ఎలా షాకులిస్తుంటారో తెలిసిందే. మన హీరోలు అవసరమైతే సిక్స్ ప్యాక్స్ చేయడానికి, ఇంకా స్టైలిష్‌గా తయారు కావడానికి ఎంతైనా కష్టపడతారు కానీ.. డీగ్లామర్ మేకోవర్లంటే కొంచెం కష్టమే.

అసలు అలాంటి పాత్రలు మన హీరోలకు ఆఫర్ చేసే దర్శకులు కూడా తక్కువే. ఐతే ఒకప్పటితో పోలిస్తే మన ప్రేక్షకుల అభిరుచి కూడా మారిన నేపథ్యంలో రచయితలు, దర్శకులు, హీరోల ఆలోచన మారుతోంది. డీగ్లామర్ క్యారెక్టర్లు రాస్తున్నారు. హీరోలూ వాటిని చేయడానికి ముందుకొస్తున్నారు. ‘రంగస్థలం’లో రామ్ చరణ్‌ను ఇలాంటి పాత్రలోనే చూపించి అందరినీ మెప్పించిన సుకుమార్.. ‘పుష్ప’ విషయంలో ఇంకో అడుగు ముందుకు వేశాడు.

రంగస్థలంలో చరణ్ కంటే కూడా ‘పుష్ప’లో అల్లు అర్జున్‌ది మరింత డీగ్లామరస్, రగ్డ్ లుక్. ఈ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ చూసినపుడే జనాలు షాకైపోయారు. తర్వాత ఏ ప్రోమో రిలీజ్ చేసినా ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతూనే ఉన్నారు. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్లో బన్నీని చూసి మరింతగా విస్తుబోతున్నారు. ఏ నోట విన్నా ఒకటే మాట.. వాట్ ఎ మేకోవర్ అని. అందులోనూ ఒకసారి బన్నీ చివరి సినిమా ‘అల వైకుంఠపురములో’ తన లుక్‌తో పోల్చుకుంటే.. ‘పుష్ప’ లుక్ విస్మయానికి గురి చేసేదే.

నిన్న థియేట్రికల్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి ‘అల..’లో సూపర్ స్టైలిష్‌గా ఉన్న లుక్.. ‘పుష్ప’లో ఊర మాస్‌గా, రఫ్‌గా ఉన్న లుక్‌ పక్క పక్కన పెట్టి బన్నీని కొనియాడుతున్నారు ఫ్యాన్స్. బహుశా తెలుగులో ఓ స్టార్ హీరో వరుసగా చేసిన రెండు సినిమాల మధ్య ఇంత వైవిధ్యం ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండమేమో. ఈ విషయంలో బన్నీతో పాటు దర్శకుడు సుకుమార్‌కు సైతం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.