గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ రికార్డ్‌...జ‌గ‌న్ సీఎంగా ఇంకో ప్ర‌త్యేక‌త‌

గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ రికార్డ్‌...జ‌గ‌న్ సీఎంగా ఇంకో ప్ర‌త్యేక‌త‌

తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్‌ నరసింహన్ ఖాతాలో ప్ర‌త్యేక రికార్డ్ న‌మోదు అయింది. 2010 జనవరిలో నరసింహన్‌ ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి నాటి నుంచీ ఆయనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన, రాష్ట్రపతి పాలన, ఏకకాలంలో సుదీర్ఘ కాలం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా పని చేయడం వంటి పలు కీలక పరిణామాలు, మూలమలుపులు, సంక్షోభ సమయాల్లో నరసింహన్‌ పాత్ర కనిపిస్తుంది. ఇలాంటి అరుదైన అవకాశం ఆయనకే వచ్చింది. రికార్డు స్థాయిలో ముఖ్య‌మంత్రులుగా ఆరుసార్లు  ప్ర‌మాణ స్వీకారం చేయించిన ఘ‌న‌త సైతం...గ‌వ‌ర్న‌ర్ న‌రసింహ‌న్ ద‌క్కించుకున్నారు.

1968 ఐపీఎస్‌ బ్యాచ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికైన నరసింహన్‌ అనంతరం చాలా ఏళ్ల‌ పాటు కేంద్ర నిఘా సంస్థ (ఐబీ)లో పని చేశారు. ఐబీ చీఫ్‌గా 2006 డిసెంబర్‌ వరకు పని చేసిన ఆయన ఆ ఏడాది చివరిలో రిటైరయ్యారు. కాగా అప్పటి యూపీఏ-1 సర్కారు నరసింహన్‌ను మావోయిస్టు ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా 2007 జనవరిలో నియమించింది.

ఏపీ గవర్నర్‌గా ఎన్‌డి తివారీ రాజీనామా చేశాక, ఆ సమయంలో కేసీఆర్‌ నిరాహారదీక్ష, అనంతరం విభజన ఆందోళనలు ఉధృతంగా నడుస్తున్న వేళ నరసింహన్‌ను ఏపీికి ఇన్‌చార్జి గవర్నర్‌గా యూపీఏ-2 సర్కారు 2009 డిసెంబర్‌ 27న నియమించింది. 2010 జనవరి 23న ఏపీికి పూర్తి స్థాయి గవర్నర్‌గా వేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఈఎస్ఎల్‌ అప్పటి కాంగ్రెస్‌ కేంద్ర పెద్దలతో మంత్రాంగం నడుపుతున్నారంటూ అప్పట్లో కేసీఆర్‌, టీడీపీ ఆరోపణలు చేశాయి.

పార్లమెంట్‌లో బిల్లు నేపథ్యంలో విభజనను నిరసిస్తూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 2014 ఫిబ్రవరి 19న రాజీనామా చేసిన దరిమిలా మార్చి 1 నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకొచ్చింది. అప్పటి నుంచి ఎన్నికలు ముగిసి ఏపీ, తెలంగాణాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరే వరకు సుమారు మూడు నెలలకుపైగా రాష్ట్రపతికి ప్రతినిధిగా పాలన సాగించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్నారు.

అలా న‌రసింహన్ సుదీర్ఘకాలం గవర్నర్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇదొక రికార్డన్న చర్చ అటు ప్రభుత్వ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. సమైక్య రాష్ట్రంలో కె రోశయ్య తర్వాత 2010 డిసెంబర్‌ 25న కిరణ్‌కుమార్‌రెడ్డితో, రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్‌ 2న తెలంగాణ సీఎంగా కేసీఆర్‌, అదే సంవత్సరం జూన్‌ 8న ఏపీ సీఎంగా చంద్రబాబుతో, తిరిగి నిరుడు డిసెంబర్‌లో రెండో సారి కేసీఆర్‌తో ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేయించిన నరసింహన్‌ ఇప్పుడు జగన్‌తో విభజిత ఏపీ రెండవ సీఎంగా ఈ నెల 30న ప్రమాణం చేయించనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English