బాబుకి, జనానికి మధ్య జగన్

బాబుకి, జనానికి మధ్య జగన్

40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబుది. తనను తాను గొప్ప వ్యూహకర్తగా, తిరుగులేని నాయకుడిగా చెప్పుకుంటాడు చంద్రబాబు. ఆయన అనుభవం, పనితనం అన్నీ కూడా ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయి. ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబుకు ఇంతకంటే ఘోర పరాభవం మరొకటి ఉండదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ ఎన్నో ఆశలతో అధికారం అప్పగించిన జనాలు ఐదేళ్లు తిరగకుండానే ఈ స్థాయిలో నాయకుడిని తిరస్కరించడమే ఆశ్చర్యకరం. బాబుకు ఈ దశలో ఇలాంటి పరాభవాన్ని ఎవ్వరూ ఊహించలేదు. విజన్ ఉన్న నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి పరాజయాన్ని కనీస స్థాయిలో కూడా ఊహించలేకపోవడమూ ఆశ్చర్యకరమే. ఆయన దగ్గర ఇంటిలిజెన్స్ ఉంటుంది. మీడియా సంస్థల అధినేతలు టచ్‌లో ఉంటారు. ఇంకా పార్టీ కేడర్ ఉంటుంది. ఇంతమంది అందుబాటులో ఉన్నా.. ఆయన ఎన్నికల ముంగిట జనాల మూడ్ ఎలా ఉందో అంచనా వేయలేకపోయారు.

చంద్రబాబుకు, జనాలకు మధ్య పెద్ద అంతరం నెలకొందన్న పెద్ద అంతరం నెలకొందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు హై ప్రొఫైల్ రాజకీయాల కారణంగా ఆయన జనాలకు బాగా దూరం అయిపోయారు. పార్టీ నాయకులు కూడా జనాల మూడ్ ఏంటన్నది బాబుకు చేరవేయడంలో విఫలమయ్యారు. అమరావతిలో కూర్చుని ఘనమైన ప్రకటనలు చేస్తూ గడిపేసిన బాబు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏంటని ఎప్పుడూ తెలుసుకోలేదు. మరోవైపు జగన్ చూస్తే 2014 ఎన్నికల తర్వాతి ఏడాది నుంచి జనంలోనే ఉన్నాడు. విరామం లేకుండా, అలుపెరగకుండా పాదయాత్రతో సాగిపోయాడు. ప్రతి నియోజకవర్గాన్నీ తడిమి చూశాడు. జనాలతో కలిసి సాగాడు. ఈ స్థితిలో జనాలకు జగన్ తమలో ఒకడిగా కనిపించాడు. చంద్రబాబు అనేవాడు తమకు అందరాని నాయకుడిలా తోచాడు. చంద్రబాబుకి, జనాలకు మధ్య నెలకొన్న ఖాళీ మొత్తాన్ని జగనే ఆక్రమించేశాడు. ఇంకా ఆ అంతరాన్ని పెంచుకుంటూ పోయాడు. దీంతో చంద్రబాబు ముఖచిత్రం జనాలకు మరింత దూరమైపోయింది. వాళ్ల మనసుల్లో జగనే ముద్రించుకుపోయాడు. ఫలితమే ఎన్నికల్లో ఈ భారీ విజయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English