అన్నీ ఉండగానే లోకేష్ ఇలా అయితే..

అన్నీ ఉండగానే లోకేష్ ఇలా అయితే..

తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తనకు మంత్రి పదవి ఉంది. అండగా నిలిచే నాయకులు పెద్ద ఎత్తున ఉన్నారు. వనరులకు లోటే లేదు. ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ నారా లోకేష్ ఎన్నికల్లో గెలవలేకపోయాడు. ఎన్నో తర్జనభర్జనల తర్వాత నియోజకవర్గాన్ని ఎంచుకుని తన సైన్యానంతా అక్కడ మోహరించి, భారీగా డబ్బు ఖర్చు చేసి, ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేసినా లోకేష్‌ను జనం ఆదరించలేదు. ఆల్రెడీ మంత్రిగా ఉన్నవాడు, పైగా సీఎం తనయుడు గెలుపు కోసం ఏం చేయాలో అన్నీ చేసి కూడా ఓడిపోవడం ఆశ్చర్యకరం. దేశంలో ఏ పెద్ద నాయకుడి వారసుడికీ ఎదురు కాని పరాభవం ఇది. కనీసం ఈ ఎన్నికల్లో లోకేష్ గెలిచి ఉంటే చంద్రబాబుకు అంతో ఇంతో స్వాంతన లభించేది. తనకు వయసు మీద పడుతున్న నేపథ్యంలో కొడుక్కి కొంత మేర బాధ్యతలు అప్పగించేవాడు. కానీ ఇప్పుడా అవకాశం లేకపోయింది.

అసలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికే ఆయనకు చాలా ఏళ్లు పట్టేసింది. ఎన్నికల్లో గెలిచి మంత్రిగా అయితే ఆ గౌరవం వేరుగా ఉండేది. పార్టీలో ఎందరో సీనియర్ నాయకుల్ని కాదని ఎన్నడూ ఎన్నికలు ఎదుర్కోని లోకేష్‌ను మంత్రిని చేయడమే చంద్రబాబు చేసిన తప్పు. దీంతో పాటుగా సీఎం కొడుకు కావడం వల్లే పార్టీలో లోకేష్‌కు ఎక్కడలేని ప్రాధాన్యం లభించింది. ఇంత కీలకమైన నాయకుడు పోటీ చేసిన తొలి ఎన్నికలోనే ఘోర పరాభవం చవిచూశాడు. అధికారం ఉండి, ఎన్నో సానుకూలతలు ఉన్నపుడే లోకేష్ తనేంటో రుజువు చేసుకోలేకపోయాడు. పార్టీని నడిపిస్తాడన్న ఆశే కలిగించలేదు. ఇక పార్టీ దారుణాతి దారుణ పరాభవం ఎదుర్కొన్ని ప్రతిపక్షంలో కూర్చున్నాక, నాయకులంతా చేజారిపోయే పరిస్థితుల్లో, తండ్రి రిటైర్మెంట్ తీసుకుంటే పార్టీని ఎలా నడిపించగలడు అన్నది ప్రశ్నార్థకం. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యక్ష ఎన్నికలతోనే ఏ నాయకుడి రాజకీయ ప్రస్థానం అయినా మొదలవుతుంది. అలా చూసుకుంటే లోకేష్ ప్రయాణం కూడా ఇప్పుడే మొదలైనట్లు. కానీ ఆరంభంలోనే ఆయన ప్రస్థానానికి ఎండ్ టైటిల్స్ పడిపోవడమే విచారకరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English