చిరు ఇప్పుడు ఉండుంటేనా..

చిరు ఇప్పుడు ఉండుంటేనా..

పదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన మెగాస్టార్ చిరంజీవి 18 అసెంబ్లీ స్థానాలు గెలిచాడు. 15 శాతానికి పైగా ఓట్లు కూడా సాధించాడు. దాన్ని పెద్ద వైఫల్యంగా చూశారందరూ. కానీ ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ 5 శాతం ఓట్లకు, ఒక్క అసెంబ్లీ స్థానానికి పరిమితం అయింది. ఇప్పుడు కానీ చిరు రేంజ్ జనాలకు అర్థం కావడం లేదు. అప్పుడు చిరు సాధించిన సీట్లు, ఓట్లు తక్కువేమీ కాదని ప్రస్తుత ఫలితాలతో జనాలకు బాగా బోధపడుతోంది. ఒకప్పుడు తమిళనాట పార్టీ పెట్టి కేవలం ఒక్క సీటు గెలిచిన విజయ్ కాంత్.. తర్వాతి పర్యాయం 29 స్థానాలు సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. రాజకీయాల్లో ఓపిక అనేది చాలా అవసరం. పదేళ్ల ఓపిగ్గా ఎదురు చూశాడు, కష్టపడ్డాడు కాబట్టే జగన్ ఈ రోజు భారీ మెజారిటీతో సీఎం కుర్చీ ఎక్కుతున్నాడు.

మెగాస్టార్.. విజయ్ కాంత్‌నే స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లో కొనసాగి ఉండాల్సింది. ఈపాటికి ఆయన కింగ్ మేకర్ అయ్యేవాడేమో. చిరు ఉంటే రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉండేవే. ఆయన సిన్సియర్‌గా పోరాడి ఉంటే ఈ రోజు సీఎం అయినా అయ్యేవాడేమో. స్వయంగా ఆయనే తనను తాను ఒక ఫెయిల్యూర్ లాగా భావించారు. నేరుగా సీఎం కుర్చీని టార్గెట్ చేయడంతో 18 సీట్లు సాధించడం వైఫల్యంగా కనిపించింది ఆయనకు. ఒకసారి ఫెయిలవ్వగానే నైరాశ్యంలోకి వెళ్లిపోయాడు. పార్టీని మూసేశాడు. అలా కాకుండా దీర్ఘ కాలిక లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగి ఉంటే ఇప్పటికి చిరు స్థాయే వేరుగా ఉండేదేమో. కనీసం పవన్ అయినా అన్నయ్యలా కాకుండా దీర్ఘ కాలిక లక్ష్యంతో అడుగులేయాలి. ప్రస్తుత ఫలితాల్ని బట్టి నిరాశ చెందాల్సిన పనేమీ లేదు. తెలుగుదేశం భవితవ్యం ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో పవన్ పట్టుదల ప్రదర్శిస్తే ముందుముందు మంచి అవకాశాలే ఉంటాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English