అక్కడ వరుసగా తొమ్మిదోసారి టీడీపీదే విజయం

అక్కడ వరుసగా తొమ్మిదోసారి టీడీపీదే విజయం

ఆంధ్రప్రదేశ్‌లో 41 రోజుల పాటు సాగిన ఉత్కంఠకు గురువారంతో తెరపడింది. తెలుగుదేశం- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని అంతా భావించినా.. వార్ మాత్రం వన్‌సైడ్ అయిపోయింది. ఈ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ, ఆ పార్టీ తరపున పోటీ చేసిన దాదాపు 150 మంది అభ్యర్థులు గెలుపొందారు. అధికార పార్టీ మాత్రం ముప్పై మార్కును కూడా దాటలేకపోయింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఎంతో మంది మంత్రులు భారీ తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక, ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ మాత్రం ఘోర పరాభవాన్ని చవి చూసింది. వైసీపీ హవా కనిపించినా ఓ చోట మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు.

అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఇక్కడ జరిగిన ప్రతి ఎన్నికలోనూ (9వ సారి) ఆ పార్టీనే విజయం సాధిస్తూ వచ్చింది. తాజా ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి విజయం సాధించారు. వాస్తవానికి హిందూపురం అంటేనే టీడీపీకి కంచుకోట. దీనిని బద్దలు కొట్టాలని 1983 నుంచి ఇతర పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయవంతం కాలేకపోయాయి. 2004 నుంచి టీడీపీ ఆధిక్యాన్ని కాస్త అడ్డుకోగలిగినా గెలుపువాకిట చతికిలపడుతున్నాయి. గత ఎన్నికల్లో గెలిచిన బాలకృష్ణను దెబ్బతీసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మాజీ ఐజీ ఇక్బాల్‌ అహ్మద్‌ను వైసీపీ బరిలోకి దించింది. అయినా.. బాలయ్య పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ గెలుపొందారు.

 ఇదే నియోజకవర్గం నుంచి దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మూడు సార్లు, ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ ఒకసారి విజయం సాధించారు. తాజా విజయంతో బాలయ్య వరుసగా రెండోసారి గెలుపొందారు. హంద్రీ-నీవా ద్వారా చెరువుల్లో నీరు నింపడం, రూ.194 కోట్లతో గొల్లపల్లి నుంచి హిందూపురానికి తాగునీటి పైపులైన్‌, హిందూపురంలో రూ.23 కోట్లతో కూరగాయల మార్కెట్‌ నిర్మాణం, రూ.66 కోట్లతో రోడ్ల నిర్మాణం, రూ.75 కోట్లతో హిందూపురంలో వాటర్‌ ట్యాంకులు, పైపులైన్‌ నిర్మాణం.. రూ.320 కోట్లతో జాతీయ రహదారి 544 నిర్మాణ పనులు మొదలుపెట్టడంతో పాటు అన్ని గ్రామాలకు లింకు తారురోడ్లు వేయడం వంటివి చేపట్టారు. రెండుసార్లు శిల్పకళాక్షేత్రం లేపాక్షి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ కారణంగానే బాలయ్యను హిందూపురం ఓటర్లు గెలిపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English