బాబు కొంప‌ముంచిన సినీ సెంటిమెంట్‌

బాబు కొంప‌ముంచిన సినీ సెంటిమెంట్‌

సినీ గ్లామ‌ర్ అండ‌గా ప్రారంభ‌మైన తెలుగుదేశం పార్టీలో సినీ ఇండస్ట్రీకి మొదట్నుంచీ ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ కావడంతో నటీనటులకు మంచి ప్రాధాన్యమే ఉండేది. ఎన్టీఆర్‌ అనంతరం చంద్రబాబు కూడా సినీగ్లామర్‌ను ఎక్కువగా నమ్ముకొన్నారు. సినీ ఆర్టిస్టులతో ప్రచారం చేయించడంలో బాబు ప్రాధాన్యం ఇచ్చేవారు. తాజాగా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతోపాటు పలువురు నటీనటులు టీడీపీ జెండాలు పట్టుకొని ప్రచారం చేశారు. కానీ ఈసారి ఆ గ్లామర్‌ ఏమాత్రం పనిచేయలేదు. ప్రముఖ నటుడు మురళీమోహన్‌ తన బదులు ఈసారి తన కోడలును బరిలోకి దింపినా, ఆమె కూడా ఓటమి పాలయ్యారు.

ఎన్నికల సమయంలో సినీగ్లామర్‌ను ఎక్కువగా నమ్ముకొనే చంద్రబాబును ఈసారి అదే సినిమారంగం ఘోరంగా దెబ్బతీసింది. ప్రధానంగా రెండు సినిమాలు టీడీపీ ఓటమికి కారణమయ్యాయి. లక్షీపార్వతి జీవితచరిత్ర ఆధారంగా.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ పరాజయ పరిస్థితులు, ఓటమి అనంతరం కుంగదీసిన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన ‘లక్షీస్‌ ఎన్టీఆర్‌’ టీడీపీ ఓటమిలో తనవంతు దోహదపడింది. మరోవైపు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘యాత్ర’ సినిమా వైసీపీకి అనుకూల పరిణామాలను తీసుకొచ్చింది. సినీగ్లామర్‌ను ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకొన్న చంద్రబాబుకు.. ఆ గ్లామర్‌ ఏమాత్రం పనిచేయలేదు.

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ సార‌థ్యంలో రూపొందిన లక్షీస్‌ ఎన్టీఆర్‌ సినిమా మొదట్నుంచీ వివాదాలనే తెచ్చిపెట్టింది. ఈ సినిమాను విడుదలచేయరాదంటూ టీడీపీ నేతలు కోర్టుకెక్కారు. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్షీపార్వతి రావడం ఆ తర్వాత చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను ఎన్నికల సమయంలో విడుదలచేయరాదని కోర్టుకెక్కడంతో.. ఏపీలో మినహా మిగిలిన ప్రాంతాల్లో విడుదలచేశారు. దాని పైరసీ మాత్రం ఏపీలోకి పాకింది. ఈ సినిమాను కొన్ని వర్గాలు ప్రత్యేకంగా ఏపీలోని సోషల్‌ మీడియాలో వైరల్‌చేశాయి. ఎన్టీఆర్‌ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్న ఏపీ ప్రజలు.. బాబును ఓడించారు. బాబు ఓటమిలో కూడా ‘లక్షీస్‌ ఎన్టీఆర్‌’ ఎంతో కొంత పాత్ర పోషించిందనిచెప్పవచ్చు.

కాగా, వైసీపీకి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘యాత్ర’ బాగా క‌లిసివ‌చ్చింది. రాజశేఖర్‌రెడ్డి ముందు నుంచి రాజకీయంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రజలకు రూపాయికే వైద్యంచేసిన రోజులు, మండు వేసవిలోచేసిన పాదయాత్ర, పాదయాత్రలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ ఈ సినిమాలో కండ్లకు కట్టినట్టు చూపించారు. యాత్ర సినిమాలో ఒక్కో డైలాగ్‌ కొన్ని వేల ఓట్లను మళ్లించిందని ఏపీ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. యాత్ర సినిమా వైఎస్‌ జగన్‌కు మేలు చేసింది. ఎన్నికల సమయంలో పలు థియేటర్లలో ఈ సినిమాను ప్రత్యేకంగా నడిపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English