ఓడిన త‌ర్వాత లోకేష్ భ‌లే స్పందించాడే

ఓడిన త‌ర్వాత లోకేష్ భ‌లే స్పందించాడే

చివరి నిమిషం వరకు ఉత్కంఠ‌ను కొనసాగించిన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీ అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా ఓల‌కేష్‌పై విజ‌యం సాధించారు. 5వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి అఖరికి మంగళగిరి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న నారా లోకేశ్… గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా బలమైన ప్రత్యర్థి కావడంతో నారా లోకేశ్‌కు ఓటమి తప్పలేదు. మొదట ఆళ్లకు గట్టి పోటీ ఇచ్చినట్టు కనిపించిన లోకేష్… ఆ తరువాత ఆధిక్యం విషయంలో వెనుకబడుతూ వ‌చ్చి ఓట‌మి పాల‌య్యారు.

అయితే, త‌న ఓట‌మి నేపథ్యంలో లోకేష్ హుందాగా స్పందించారు. ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసి త‌న భావాల‌ను వెల్ల‌డించారు. ``మంగ‌ళ‌గిరి నుంచి ఎమ్మెల్యేగా నాపై గెలిచిన వైకాపా అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిగారికి నా అభినంద‌న‌లు. నాపై అత్యంత విశ్వాసంతో ఓట్లు వేసిన ప్ర‌జ‌లంద‌రికీ నా న‌మ‌స్కారాలు. ప్ర‌జాతీర్పును గౌర‌విస్తున్నాను. నామినేష‌న్ వేసిన నుంచీ కౌంటింగ్ వ‌ర‌కూ అహ‌ర్నిశ‌లు నా కోసం శ్ర‌మించిన తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. తొలిసారిగా ఎన్నిక‌ల‌లో పోటీచేసిన నాకు మ‌ద్ద‌తుగా నిలిచిన ప్ర‌తీ ఒక్క‌రికీ పేరుపేరునా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. మీడియా మిత్రుల స‌హ‌కారం మ‌రువ‌లేనిది. ఎన్నిక ప్ర‌క్రియ‌ ప్రశాంతంగా సాగేందుకు స‌హ‌క‌రించి ప్ర‌జాస్వామ్య స్ఫూర్తిని చాటిన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచారు. నియోజ‌క‌వ‌ర్గ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటాను.  మంగ‌ళ‌గిరి అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను. ప్ర‌జ‌ల్లో ఉంటూ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడ‌తాను. మీ నారా లోకేష్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి`` అంటూ లోకేష్ ఆ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

కాగా, ఆర్కేకు వ్యక్తిగతంగా మంచి పేరుంది. అధికారంలో లేకపోయినా తన స్థొమతకు తగ్గట్టు ఆయన సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఇరువురు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. దీంతో ఈ స్థానంలో గెలుపు ఎవరికి దక్కుతుందనే అంశంపై గత 40 రోజులుగా సస్పెన్స్ కొనసాగింది. ఏపీలో లోకేష్ విజయావకాశాలపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్ జరిగిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ చివరకు ఈ స్థానంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English