తెలంగాణలో కాంగ్రెస్‌కు కొత్త ఊపు

తెలంగాణలో కాంగ్రెస్‌కు కొత్త ఊపు

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా.. అక్కడ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఆ పార్టీ.. గత డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ దారుణమైన పరాభవాన్ని చవి చూసింది. దీంతో తాజా లోక్‌సభ ఎన్నికలపై భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. బలమైన తెలంగాణ రాష్ట్ర సమితిని నిలువరించేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి ఊహించని రీతిలో ఫలితాలు వచ్చాయి. ఎంతో కీలకమైన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడు చోట్ల విజయం దక్కింది. రాష్ట్రంలో ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఆ పార్టీకి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొత్త ఊపును తెచ్చాయి.

 వాస్తవానికి ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, గతంలో వచ్చిన పలు సర్వేలు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తుందని ప్రకటించాయి. దీనికితోడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే, దీనికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ మూడు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై 4,657 ఓట్ల ఆధిక్యంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. ఇక, దేశంలోనే పెద్దదైన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి 6,270 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే నల్లగొండ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 20 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు.

 ఈ ముగ్గురిలో కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి గత ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అలాంటిది లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్ఠానం వీరిద్దరికీ మరో అవకాశం ఇచ్చింది. దీనిని చక్కగా వినియోగించుకున్న వీరిద్దరూ ఘన విజయం సాధించారు. వీళ్లు గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పవచ్చు. మంచి వాయిస్ ఉన్న నేతలు కావడంతో వాళ్లకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, ముందస్తు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొండా విశ్వేశ్వర రెడ్డి తృటిలో విజయాన్ని కోల్పోయారు. చేవేళ్ల నుంచి బరిలోకి దిగిన ఆయన మొదటి నుంచీ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ.. చివరి రౌండ్‌లో ఓడిపోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English