కొట్టుకు చస్తున్న టీడీపీ, జనసేన ఫ్యాన్స్

కొట్టుకు చస్తున్న టీడీపీ, జనసేన ఫ్యాన్స్

ఆంధ్రా రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాక చూస్తే తెలుగుదేశం, జనసేన ప్రధాన ప్రత్యర్థి పార్టీలేమో అనిపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రెండు పార్టీలకు ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్సార్ కాంగ్రెస్‌ను పక్కన పెట్టేశారు. ఆ పార్టీ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించడంతో ఏమీ అనడానికి లేకపోయింది. హోరాహోరీ పోరు సాగుతుంటే ఒకరినొకరు ఏమైనా అనుకోవడానికి ఉండేది. అందుకు అవకాశం లేకపోవడంతో టీడీపీ ఫ్యాన్స్.. జనసేన మీద పడ్డారు. జనసేన మద్దతుదారులు టీడీపీని టార్గెట్ చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పవన్ తమవైపు ఉండి.. ఇప్పుడు ప్రత్యర్థిగా మారి ఓట్లు చీల్చడం వల్ల దారుణంగా నష్టపోయామంటూ పవన్‌ను తిట్టిపోస్తున్నారు టీడీపీ ఫ్యాన్స్. మీకు చేత కాక మా నాయకుడి మీద పడి ఏడుస్తారా అంటూ జనసేన మద్దతుదారులు ఎదురుదాడి చేస్తున్నారు.

తెలుగుదేశానికి, వైకాపాకు ఓట్ల శాతంలో అంతరం చాలా పెద్ద స్థాయిలో ఉన్న నేపథ్యంలో తెదేపా ఓటమికి పవన్ కారణం కాదని వాదిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ పట్ల సానుకూలత హెచ్చు స్థాయిలో ఉందని.. అందుకే ఇంతటి పరాభవం ఎదురైందని అంటున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన మద్దతుదారులు ఒకరినొకరు ఎగతాళి చేసుకునే పని కూడా గట్టిగానే సాగుతోంది. పవన్ రెండు చోట్లా ఓడిపోయే సూచనలు కనిపిస్తుండటం, ఐదు శాతానికి ిమించి జనసేనకు ఓట్లు వచ్చే అవకాశాలు కనిపించకపోవడంపై తెలుగుదేశం వాళ్లు సెటైర్లు వేస్తుంటే.. మూడున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ ఈ స్థాయిలో మట్టికొట్టుకుపోవడాన్ని జనసైనికులు ఎద్దేవా చేస్తున్నారు. లోకేష్ సహా పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులు దారుణ పరాభవాలు ఎదుర్కొంటుండటాన్ని ఎత్తి చూపుతున్నారు. మొత్తానికి తమ అసహనాన్ని ఎలా చూపించాలో తెలియక ఒకరినొకరు ఆడిపోసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English