మొదలైంది కాక.. తెరపైకి ఎన్టీఆర్ పేరు

మొదలైంది కాక.. తెరపైకి ఎన్టీఆర్ పేరు

తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ చూడని పరాభవం ఇది. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనం సాగినపుడు కూడా ఈ స్థాయి పరాజయం చవిచూడలేదు. హోరాహోరీ పోరు ఉంటుందనుకుంటే.. మరీ ఇలా ఏకపక్షంగా వైకాపా గెలవడం ఎంతమాత్రం మింగుడుపడనిదే. ఈ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఎవ్వరూ అనుకోలేదు.

ఇప్పుడు పార్టీ భవితవ్యం ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం బతికి బట్టగట్టడమే కష్టం అనే భావన వ్యక్తమవుతోంది. 2004-2014 మధ్య అధికారంలో లేని సమయంలో చంద్రబాబు ఎంత బలహీనంగా, బేలగా తయారయ్యారో తెలిసిందే. అధికారంలో లేనపుడు చాలా బలహీనంగా కనిపించే నాయకుల్లో బాబు ఒకరు. పార్టీని నిలబెట్టుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. అధికారంలో లేని జగన్ పార్టీలోకి ఎమ్యెల్యేలు వరుస కడుతుంటే ఆపలేకపోయారు.

కానీ ఇప్పుడు జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెదేపా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై ఉంది. ఈ స్థితిలో ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేల్ని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఇక నాయకుల వలస ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయడం కష్టమేమీ కాదు.  ప్రస్తుతం చంద్రబాబు వయసు 68 ఏళ్లు. ఈ వయసులో ఆయన పార్టీని నిలబెట్టడం చాలా కష్టం. కొడుక్కి బాధ్యతలు అప్పగిద్దామంటే లోకేష్ సమర్థత గురించి ఎన్ని సందేహాలున్నాయో తెలిసిందే. లేక లేక ప్రత్యక్ష ఎన్నికల్లోకి దించి ఓటమి పాలవుతున్నాడు. బాలయ్య సంగతి సరేసరి. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ అగమ్య గోచరంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆ పార్టీని నిలబెట్టగల ఏకైక వ్యక్తి జూనియర్ ఎన్టీఆరే అన్న అభిప్రాయం మొదలైంది.

తెలుగుదేశం ఓడితే ఎన్టీఆరే దిక్కు అనే అభిప్రాయం ముందు నుంచి ఉంది. ఐతే ఇప్పుడు తెలుగుదేశం ఘోరాతి ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ అభిప్రాయం మరింత బలపడుతోంది. ఆల్రెడీ జనాలు సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు మెసేజ్‌లు పెడుతున్నారు. తెలుగుదేశం మద్దతుదారులు సైతం పార్టీని ఎన్టీఆర్‌కు అప్పగించాలని పెద్ద ఎత్తున అభిప్రాయపడుతున్నారు. కానీ చంద్రబాబు పుత్ర ప్రేమను పక్కన పెట్టి, వాస్తవికంగా ఆలోచించి తారక్‌ను తెరముందుకు తెస్తారా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English