రేవంత్ ను ఎంపీని చేసింది కేసీఆరే కదా

రేవంత్ ను ఎంపీని చేసింది కేసీఆరే కదా

ఎనుముల రేవంత్ రెడ్డి... ఏ పార్టీలో ఉన్నా ఫైర్ బ్రాండే. ఎమ్మెల్యేగానే ఇప్పటిదాకా తనదైన శైలి రాజకీయాలను నడిపిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. ఈ ప్రమోషన్ కు రేవంత కు బద్ద శత్రువు... ఆయన ఎదుగుదలను ఎంతమాత్రం సహించలేని కేసీఆరే కారణమని ఇప్పుడు సరికొత్తగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. పాలమూరు జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఎమ్యెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన నాటి నుంచి తనదైన శైలి దూకుడును ప్రదర్శించిన రేవంత్ రెడ్డి టీడీపీలో కీలక నేతగానే ఎదిగారు.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆయన కొడంగల్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో టీడీపీకి గుడ్ బై కొట్టేసిన రేవంత్... కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా సాగిన రేవంత్... కేసీఆర్ పైనా, ఆయన కుమారుడు కేటీఆర్ పైనా తనదైన శైలి వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను అడ్డంగా బుక్ చేసిన కేసీఆర్ సర్కారు... ఆయనను ఏకంగా జైల్లో పెట్టేసింది. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గని రేవంత్... కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్నారు. ఈ క్రమంలో రేవంత్ ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదిపిన టీఆర్ఎస్... ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ పై ప్రత్యేక దృష్టి సారించింది. ట్రబుల్ షూటర్ హరీశ్ రావును దించేసిన కేసీఆర్... రేవంత్ ను ఓడించారు.

అయితే అసెంబ్లీ బరిలో రేవంత్ ను ఓడించేసిన కేసీఆర్... ఆయనను నేరుగా పార్లమెంటుకు పంపినట్లైంది. నిజంగానా? అంటే... నిజమేనని చెప్పక తప్పదు. కొడంగల్ ఓడిపోకుంటే... అసలు రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల బరిలోకి దిగేవారే కాదు. కొడంగల్ లో ఎలాగూ ఓడిపోయాను కదా... పార్లమెంటు ఎన్నికల్లో అయినా అదృష్టాన్ని పరీక్షించుకుందామని రేవంత్ భావించగా... కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు టికెట్ ఇచ్చేసింది. ఇంకేముంది... తనకు మంచి పట్టున్న మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి... నేడు జరిగిన కౌంటింగ్ లో విజేతగా నిలిచారు. అంటే అసెంబ్లీలోనే ఉండాలని రేవంత్ రెడ్డి భావిస్తే...  అక్కడ ఆయనను ఒడించిన కేసీఆర్ నేరుగా పార్లమెంటుకు పంపారన్న మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English