జిల్లాలకు జిల్లాలు ఊడ్చేస్తున్న వైసీపీ

జిల్లాలకు జిల్లాలు ఊడ్చేస్తున్న వైసీపీ

ఇది చరిత్రాత్మకమే. ఎవ్వరూ ఊహించని విజయమే. బహుశా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు.. స్వయంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి విజయాన్ని ఊహించి ఉండడు. 175 స్థానాల్లో 150కి పైగా గెలవడం అంటే మామూలు విషయం కాదు. 2004లో వైఎస్ ప్రభంజనం సాగిన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో 185 స్థానాలు గెలిచింది.

కానీ అప్పటికి మొత్తం స్థానాలు 294. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడంతో ఏపీలో 175 స్థానాలే ఉన్నాయి. అందులో 150కి పైగా స్థానాలు సాధించబోతుండటం అంటే ఫలితాలు ఎంత ఏకపక్షంగా ఉన్నాయో అంచనా వేయొచ్చు. ఏపీలో జిల్లాలకు జిల్లాల్ని ఊడ్చేస్తోంది వైసీపీ. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉండి, ఏకపక్ష విజయాన్ని అందించిన జిల్లాల్ని సైతం వైసీపీ పూర్తిగా తన వైపు తిప్పుకుంది. పశ్చిమ గోదావరిలో 15కు 15 సీట్లలో వైసీపీ ఆధిక్యంలో సాగుతుండటం అంటే మామూలు విషయం కాదు. విజయనగరం జిల్లాలో సైతం అన్ని సీట్లూ వైసీపీ సొంతమయ్యేలా ఉన్నాయి.

జగన్ గడ్డ కడప జిల్లాలో కూడా 10కి 10 స్థానాల్లో వైసీపీ జయకేతనం ఎగురవేస్తోంది. 2004లో వైఎస్ ప్రభంజనం సాగినపుడు కూడా తెలుగుదేశం వైపే నిలిచిన అనంతపురం జిల్లా ఈసారి వైసీపీకి మెజారిటీ స్థానాలు కట్టబెడుతోంది. రాయలసీమలోని మిగతా జిల్లాల్లో సైతం ఇదే పరిస్థితి. ఉత్తరాంధ్రలో 40 స్థానాలకు 35 దాకా వైసీపీ సొంతమయ్యే పరిస్థితి ఉందంటే అక్కడ జగన్ ప్రభంజనం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. రాజధానిపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు అమరావతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి కష్టమే అనుకున్నారు. కానీ ఆ రెండు జిల్లాల్లో కూడా వైసీపీ మెజారిటీ స్థానాలు సాధిస్తుండటం అనూహ్యం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English