ఓట్ షేర్ తేడా.. మైండ్ బ్లోయింగ్

ఓట్ షేర్ తేడా.. మైండ్ బ్లోయింగ్

2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఐతే అప్పుడు కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ షేర్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? 38.56 శాతం. తెలుగుదేశం పార్టీకి ఓట్ షేర్ 37.59 శాతం. అంటే తేడా 1 శాతం లోపే అన్నమాట. ఐతే కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలు జత కలవడంతో చంద్రబాబుకు ఘోర పరాభవం తప్పలేదు.

తర్వాతి పర్యాయం కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. వైఎస్ నేతృత్వంలో మరోసారి విజయం సాధించింది. ఐతే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు 2 శాతం తగ్గాయి. కానీ తెలుగుదేశం పార్టీ ఓటు శాతం 9.5 దాకా తగ్గింది. కానీ టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి పోటీ చేసిన మహా కూటమి.. కాంగ్రెస్ పార్టీకి చేరువగా వచ్చింది. కేవలం 1.5 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ విజయాన్నందుకుంది.

ఇక గత పర్యాయం తెలుగురాష్ట్రం విడిపోయాక ఏపీలో క్లోజ్ ఫైట్ నడిచింది. 4.4 శాతం ఓట్లను పెంచుకుని మొత్తంగా 32.53 శాతం ఓట్లతో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీకి చాలా దగ్గరగా వచ్చింది. ఆ పార్టీకి 32.10 శాతం ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 0.4 శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయింది వైకాపా. టీడీపీ కంటే 5 లక్షల ఓట్లు మాత్రమే ఆ పార్టీకి తక్కువ రావడం గమనార్హం. ఐతే ప్రస్తుత ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల తేడా చూస్తే షాక్ తగలడం ఖాయం.

ఏకంగా 12 శాతం పైగా ఓట్ల ఆధిక్యంతో జగన్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ ఓట్ల శాతం 50కి దాటిపోయింది. తెలుగుదేశం పార్టీ 38 శాతం దాకా ఓట్లు సాధించగలిగింది. గత పర్యాయం కంటే ఓట్ల శాతం పెరిగినా ఫలితం లేకపోయింది. జనసేన 5 శాతానికి కాస్త ఎక్కువగా ఓట్లు సాధిస్తున్నట్లు తెలుస్తోంది. గత పర్యాయం 7 శాతం ఓట్లు సాధించిన భాజపా ఈసారి కేవలం 0.75 శాతం ఓట్లతో సాగుతుండటం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English