నరేంద్ర మోడీ.. 2014ను మించి

నరేంద్ర మోడీ.. 2014ను మించి

నరేంద్ర మోడీ ప్రధానిగా ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయాడని.. ఈసారి ఎన్డీయేకు అంత ఈజీ కాదని.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచినా.. ప్రభుత్వ ఏర్పాటుకు చాలా కష్టపడాల్సి ఉంటుందని.. ప్రస్తుత ఎన్డీయే పక్షాలకు పూర్తి స్థాయి మెజారిటీ రావడం కష్టమని. ఇలా నడిచాయి ఎన్నికల ముందు విశ్లేషణలు. కానీ ఫలితాలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. మోడీ సర్కారుకు దేశం పట్టం కట్టినట్లే కనిపిస్తోంది. 2014 విజయాన్ని ఎప్పటికీ మోడీ రిపీట్ చేయలేడని అనుకుంటే.. అంతకుమించి విజయం సాధించే పరిస్థితి కనిపిస్తోంది.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తొలి నిమిషం నుంచి మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఉదయం 10 గంటల సమయానికి ఎన్డీయే 336 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం. యూపీఏ 109 స్థానాల్లో.. అంటే ఎన్డీయేతో పోలిస్తే మూడో వంతు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుండటం గమనార్హం. ఒక్క తమిళనాడులో డీఎంకే మినహాయిస్తే యూపీయేలో భాగస్వామి అయిన ఏ పార్టీ కూడా ఏ రాష్ట్రంలోనూ ఆధిపత్యం ప్రదర్శించడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో సైతం 15కు పైగా స్థానాల్లో బీజేపీ గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాటకలో 28 పార్లమెంటు స్థానాలు ఉండగా.. అందులో 20కి పైగా సీట్లు భాజపా సొంతం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

రాజస్థాన్‌లో 25కు 24 స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉండటం గమనార్హం. బీహార్లో 31కి 24 స్థానాలు భాజపా సొంతమయ్యే పరిస్థితి ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో 80 స్థానాలుండగా... ఎస్పీ, బీఎస్పీ కలిసినా.. భాజపా హవాకు తెరదించే పరిస్థితి కనిపించడం లేదు. 50కి పైగా స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉంది. ఢిల్లీలో ఏడుుకు ఏడు స్థానాల్లోనూ బీజేపీనే ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తంగా ఉత్తర భారతం మొత్తం మోడీపై పూర్తి స్థాయి భరోసా ఉంచినట్లే కనిపిస్తోంది. 2014ను మించి భారీ విజయం దిశగా దూసుకుపోతున్నాడు మోడీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English