షాకింగ్.. అమేథీలో ఓటమి దిశగా రాహుల్

షాకింగ్.. అమేథీలో ఓటమి దిశగా రాహుల్

అమేథీ నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి కంచు కోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా గాంధీల కుటుంబానికి అక్కడ తిరుగులేదు. ఇందిరా గాంధీ అక్కడ 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచేవారు. ఆ తర్వాత కూడా ఘన వారసత్వం కొనసాగుతోంది. ఐతే ఈసారి అక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలేలా ఉంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన అభ్యర్థి రాహుల్ గాంధీ అమేథీలో ఓటమి దిశగా సాగుతుండటం గమనార్హం.

ఉదయం కౌంటింగ్ ఆరంభమయ్యాక తొలి రౌండ్ నుంచి రాహుల్ వెనుకబడే ఉన్నాడు. ఆయన ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మంత్రి స్మృతి ఇరానీ విజయం దిశగా సాగుతోంది. ఆమె ఆరంభం నుంచి ఆధిక్యంలో ఉండగా.. కడపటి వార్తలందేసరికి ఆధిక్యం 20 వేలకు చేరుకుంది. ట్రెండ్ చూస్తుంటే రాహుల్‌కు అమేథీలో షాక్ తప్పదనే అనిపిస్తోంది.

అమేథీలో వ్యతిరేకతను పసిగట్టే రాహుల్.. దక్షిణాది వైపు చూశాడని ఎన్నికల ముందే గుసగుసలు వినిపించాయి. ఆయన కేరళలోని వయనాడ్ నుంచి కూడా పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ మాత్రం రాహుల్ ఆధిక్యంలోనే ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రధాన అభ్యర్థిగా ఉన్న వ్యక్తి తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న స్థానంలో ఓడిపోతే అంతకంటే అవమానం మరొకటి ఉండదు. మొత్తంగా ప్రాథమికంగా ఉన్న ట్రెండ్స్ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి నిరాశాజనక ఫలితాలు తప్పవని తెలుస్తోంది. ఎన్డీయే ప్రస్తుతం 280కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. యూపీఏ 125 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోసారి మోడీ సర్కారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనమే అనిపిస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English