కౌంటింగ్ జోరు..బాబు రెండు కీల‌క నిర్ణ‌యాలు

కౌంటింగ్ జోరు..బాబు రెండు కీల‌క నిర్ణ‌యాలు

దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల ఫ‌లితాల కౌంటింగ్ ప్రారంభం అయింది. అన్ని పార్టీలు ఫ‌లితాల కోసం ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో గురువారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ  గెలుపును ఏ శక్తి ఆపలేదని మరోమారు స్పష్టం చేశారు. కౌంటింగ్ చివరివరకు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని సూచించారు. వైకాపా నేతలు అరాచకాలకు పాల్పడినా సంయమనం పాటించాలని ఆయన కోరారు. మ‌రోవైపు జాతీయ స్థాయిలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా చంద్ర‌బాబు కీల‌క అడుగులు వేస్తున్నారు.

ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేనందున యూపీఎ పక్షాలతోపాటు మిగిలిన పార్టీలు కలిసి కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని క‌స‌ర‌త్తు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతానికి ఆ ఫ్రంట్‌కు సెక్యూలర్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ అని పేరు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ రాదని విపక్ష నేతలు భావిస్తున్నారు. దీంతో యూపీఏలోని ఆరు పార్టీలతో పాటు తెలుగుదేశం, తృణమూల్‌ కాంగ్రెస్‌, బహుజన సమాజ్, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీతో పాటు వామపక్షాలు కలిసి ఈ కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇదిలాఉండ‌గా, ఢిల్లీలో ప‌రిణామాలు మారుతున్నాయి. హంగ్‌ ఏర్పడే పక్షంలో ఇవాళ సాయంత్రం  ఢిల్లీలో విపక్షాల భేటీకి రంగం సిద్ధమైంది. యూపీఏతో పాటు  బీజేపీ వ్యతిరేక పార్టీలను ఈ భేటీకి ఆహ్వానించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.  ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుంటే యూపీఏలోని ఆరు పక్షాలతోపాటు టీడీపీ, బహుజన సమాజ్‌ వాదీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీతో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక కూటమిగా ఏర్పడాలని ప్రతిపాదించ‌డంతో పాటుగా టీఆర్‌ఎస్‌, వైకాపా నేతలకు కూడా ఈ భేటీకి ఆహ్వానించాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. హంగ్‌ వచ్చే పక్షంలో అతి పెద్దగా కూటమిగా ఏర్పడి... ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని రాష్ట్రపతికి లేఖ ఇవ్వాలని విపక్ష నేతలు భావిస్తున్నారు. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై ఓ అంచనా ఏర్పడుతుందని, హంగ్‌కు ఛాన్స్‌ ఉండే పక్షంలో ఇవాళ  రాత్రికి ఢిల్లీలో విపక్షాల భేటీ ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English