టీడీపీ గెలిచినా.. ఈ మంత్రుల ఓటమి ఖాయమట

టీడీపీ గెలిచినా.. ఈ మంత్రుల ఓటమి ఖాయమట

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి 40 రోజులు దాటిపోయింది. ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి నేటి వరకు ఏమాత్రం తన ధీమాను తగ్గించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో ప్రతిరోజూ 20 గంటలు పని చేసిన నాయకులు, ఆ తర్వాత కూడా అదే పద్ధతిలోనే పని చేస్తున్నారు. అయితే, అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓట్ల లెక్కింపు సమయం వచ్చేసింది. మరికొన్ని గంటల్లో లెక్కింపు ప్రారంభం కానుంది. విజయం ఎవరిని వరిస్తుందోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమమే గెలిపిస్తోందని తెలుగుదేశం పార్టీ ధీమా వ్యక్తం చేస్తుండగా... ప్రభుత్వ వ్యతిరేకత, ఇచ్చిన హామీలు, సానుభూతి గెలిపిస్తాయనే నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయనే విశ్లేషణలు జోరందుకున్నాయి.

 వాస్తవానికి ఈ సారి జరిగిన సార్వత్రిక పోరులో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. డబ్బు ప్రభావం జోరుగా ఉండడంతో ఓటర్లు ఎవరికి ఓటు వేశామన్నది చెప్పడంలేదు. రెండురోజుల క్రితం వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు మిశ్రమంగానే వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మినహా ప్రధాన పార్టీల నేతలు, ముఖ్యులు ఎగ్జిట్‌పోల్‌పై అంతగా స్పందించలేదు. 2014లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్‌ తేల్చి చెప్పగా సీన్‌ రివర్స్‌ అయింది. ఈ సారి కూడా అదే పరిస్థితులు ఏర్పడతాయని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. అయితే, ఇప్పుడు ఆ పార్టీలో సరికొత్త వాదన ఒకటి వినిపిస్తోందట. ఇది అధికార పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ ఆసక్తికర విషయం పార్టీ గోడలను దాటి బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఇది హాట్ టాపిక్ అయింది.

 తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మంత్రులలో చాలా మంది ఓడిపోతారనేదే ఆ వార్త సారాంశం. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పితాని సత్యనారాయణ ఓటమి ఖాయమన్న వార్త బయటకు వచ్చింది. తాజాగా ఈ జాబితాలో మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన భూమా అఖిలప్రియ, కృష్ణా జిల్లా తిరువూరు నుంచి పోటీ చేసిన జవహార్, మైలవరం నుంచి పోటీ చేసిన దేవినేని ఉమ, విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దిగిన గంటా శ్రీనివాస్, నర్సీపట్నం నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు, చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి బరిలోకి దిగిన అమరనాథ్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. టీడీపీ చేసిన అంతర్గత సర్వేలో సైతం వీళ్ల పేర్లు ఉన్నట్లు సమాచారం.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English