ఇటు హైకోర్టు, అటు ఈసీ ముంగిట... బాబు పోరు ఉధృతం

ఇటు హైకోర్టు, అటు ఈసీ ముంగిట... బాబు పోరు ఉధృతం

ఓట్ల లెక్కింపులో వీవీ ప్యాట్లను 50 శాతం మేర లెక్కించాల్సిందేనన్న డిమాండ్ తో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మొదలెట్టిన పోరు క్రమంగా ఉధృతం అవుతోంది. కౌంటింగ్ కు సమయం దగ్గరపడిన నేపథ్యంలో చంద్రబాబు తన పోరాటాన్ని ఒక్కసారిగా పెంచేశారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లిన చంద్రబాబు... 21 పార్టీలకు చెందిన కీలక నేతలతో మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. అదే సమయంలో ఇదే విషయంపై ఏపీ హైకోర్టులో సోమవారం ఓ పిటిషన్ దాఖలైంది. ఈ రెండింటి ఉద్దేశం ఒకటే అయిన నేపథ్యంలో బాబు డిమాండ్ కు ఈసీ తలవంచక తప్పదా? అన్న వాదన వినిపిస్తోంది.

అయినా ఇప్పుడు చంద్రబాబు తన పోరాటంలో కొత్తగా వినిపిస్తున్న మాట ఏమిటంటే... కౌంటింగ్ లో ముందుగా ర్యాండమ్ గా ఎంచుకున్న ఐదు పోలింగ్ బూత్ లకు సంబంధించిన ఈవీఎం, వీవీ ప్యాట్లను లెక్కించాలని, వాటి మధ్య తేడా రాకుంటే ఫరవా లేదని, తేడా వస్తే మాత్రం ఆ నియోజకవర్గంంలోని మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఐదు ర్యాండమ్ బూతుల వీవీ ప్యాట్ల లెక్కింపుపై ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇదే డిమాండ్ తో  21 పార్టీలతో కలిసి చంద్రబాబు ఈసీని కలవనున్నారు.

ఇక ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ విషయానికి వస్తే... అందులోని డిమాండ్ కూడా ఇదే. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... దీనిని అత్యవసరమైనదిగానే భావించి లంచ్ మోషన్ పిటిషన్ గా పరిగణించింది. దీంతో ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. మొత్తంగా అటు ఈసీతో చంద్రబాబు భేటీ, ఇటు హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణలతో ఒక్కసారిగా ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్న ఆసక్తి నెలకొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English