గంటా ఓడిపోతారు... రాజుగారి లెక్క ఇదే

గంటా ఓడిపోతారు... రాజుగారి లెక్క ఇదే

గంటా శ్రీనివాసరావు... ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరే. వ్యాపారవేత్తగా తనదైన శైలిలో రాణించిన గంటా... రాజకీయ అరంగేట్రం కోసం టీడీపీనే ఎంచుకున్నారు. అయితే తన సొంత సామాజిక వర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి దిగుతుండటంతో గంటా కూడా ఆయన పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. టీడీపీలో గెలుపు గుర్రంగానే కనిపించిన గంటా... ప్రజారాజ్యంలోనూ గెలుపు గుర్రమే అయ్యారు. ఆ తర్వాత తనను నమ్ముకున్న వాళ్లనంతా నట్టేట ముంచుతూ చిరు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేయడంతో గంటా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఏకంగా మంత్రి కూడా అయ్యారు.

ఆ తర్వాత రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోగా... కాస్తంత ముందుగానే మేల్కొన్న గంటా... తిరిగి తన సొంత గూడు టీడీపీలోకి చేరారు. 2014లో భీమిలి నుంచి గెలిచిన గంటా... చంద్రబాబు కేబినెట్ లో ఏకంగా కీలక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మొత్తంగా ఇప్పటిదాకా గెలుస్తూనే వస్తున్న గంటా... 2019 ఎన్నికల్లో మాత్రం కాస్తంత భయపడ్డట్టుగానే కనిపించింది. గడచిన సారి భీమిలి నుంచి పోటీ చేసిన గంటా... ఈ సారి పలు కారణాల రీత్యా విశాఖ ఉత్తర అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థితో గంటాకు పెద్దగా ఇబ్బంది లేకున్నా... సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుతోనే భీకర పోరు సాగించాల్సి వచ్చింది.

గడచిన ఐదేళ్లలో ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు చాలా దగ్గరైన రాజు... ప్రజా సమస్యలపై... ప్రత్యేకించి విశాఖలో వెలుగు చూసిన భూ కుంభకోణాలపై తనదైన శైలి పోరాటం చేశారు. ఫలితంగా రాజుకు ఒక్క విశాఖలోనే కాకుండా రాష్ట్రం మొత్తం మీద మంచి పేరు వచ్చింది. ఈ ప్రభావం గంటాను బాగానే దెబ్బ తీసేలా ఉందన్న విశ్లేషణలు ఆది నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే మాటను ప్రస్తావించిన రాజు... ఈ దఫా గంటాకు ఓటమి తప్పదని చెప్పేశారు. మరి రాజుగారు చెప్పినట్టు గంటాకు ఓటమే స్వాగతం పలుకుతుందో, లేదంటే మరోమారు ఆయనకు గెలుపు వెల్ కమ్ పలుకుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English