అఖండ‌కు నార్త్ ఇండియ‌న్స్ ప్ర‌మోష‌న్

యూట్యూబ్‌లో, అలాగే హిందీ ఛానెళ్ల‌లో డ‌బ్బింగ్ సినిమాల ద్వారా మ‌న స్టార్ హీరోలంద‌రికీ ఉత్త‌రాదిన గ‌త కొన్నేళ్ల‌లో బాగానే ఫాలోయింగ్ ఏర్ప‌డింది. దీంతో కొత్త‌గా ఇక్క‌డ ఏ సినిమా రిలీజైనా కూడా వాటి ప‌ట్ల ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. నార్త్ మార్కెట్లో చిన్న స్థాయిలో సినిమాలు రిలీజైనా అక్క‌డుండే తెలుగు వాళ్ల‌తో పాటు ఉత్త‌రాది ప్రేక్ష‌కులు కూడా మ‌న సినిమాలు చూస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.

తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అఖండ సినిమా ప‌ట్ల కూడా నార్త్ ఫ్యాన్స్‌లో బాగానే ఆస‌క్తి క‌నిపిస్తోంది. బాలీవుడ్లో ఇలాంటి మాస్ సినిమాలు బాగా క‌ర‌వైపోవ‌డంతో బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో మాస్ ప్రేక్ష‌కులు ఈ త‌ర‌హా చిత్రాల‌పై బాగా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో అఖండ గురించి ఉత్త‌రాది ప్రేక్ష‌కుల్లో ఒక చ‌ర్చ న‌డుస్తుండ‌టం విశేషం. బాలీవుడ్లో వ‌చ్చే సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో హిందుత్వాన్ని కించ‌ప‌ర‌చ‌డం ఫ్యాష‌న్ అయిపోయింద‌ని.. ఎంత‌సేపూ క్రిస్టియానిటీని, ఇస్లాంను వాళ్లు ప్ర‌మోట్ చేస్తుంటార‌ని.. ఆ మతాల ప‌ట్ల సానుకూల భావాన్ని చూపిస్తూ, హిందుత్వం మీద విషం చిమ్మ‌డం మామూలైపోయింద‌ని అంటున్నారు.

బాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్ ఇలా ఉంటే.. సౌత్ సినిమాల్లో మాత్రం హిందుత్వం గురించి పాజిటివ్‌గా చూపిస్తున్నార‌ని.. ముఖ్యంగా అఖండ మూవీలో హిందుత్వ ధ‌ర్మం గురించి.. దేవాల‌యాల ప్రాధాన్యం గురించి చాలా గొప్ప‌గా చెప్పార‌ని.. హిందూ ఐడియాల‌జీని సానుకూల ధోర‌ణిలో చూపించార‌ని.. ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో చాలా అవ‌స‌ర‌మ‌ని నార్త్ ఆడియ‌న్స్ పోస్టులు పెడుతుండ‌టం విశేషం. బాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్ త‌మ మూలాల‌ను మ‌రిచిపోతున్నార‌ని.. అఖండ మూవీని చూసి వాళ్లు బుద్ధి తెచ్చుకోవాల‌ని అంటున్నారు. తెలుగు వారిలో కూడా హిందు సంస్కృతి సంప్ర‌దాయాల ప‌ట్ల ఆరాధ్య భావం ఉన్న వాళ్లంద‌రూ అఖండ‌ను కొనియాడుతున్నారు.