రేవంత్‌కు షాక్‌...టీఆర్ఎస్ గూటికి సీత‌క్క‌?

రేవంత్‌కు షాక్‌...టీఆర్ఎస్ గూటికి సీత‌క్క‌?

తెలంగాణ రాజ‌కీయాలు మ‌రింత హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఇప్ప‌టికే వ‌రుస షాకులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మంటున్నారు. మ‌రో కీల‌క ఎమ్మెల్యే ఆ పార్టీకి బైబై చెప్తార‌ని అంటున్నారు.  గ‌త ఏడాది జ‌రిగిన‌ అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ప‌దకొండు మంది టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు వెల్ల‌డించారు. ఈ షాకుల ప‌రంప‌ర‌ను మ‌రింత కొన‌సాగించ‌డంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య‌నేత రేవంత్ స‌న్నిహితురాలిగా పేరొందిన ఎమ్మెల్యే సీత‌క్క టీఆర్ఎస్ గూటికి చేరేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.  

ఉద్యమ బాట నుంచి రాజకీయం వైపు అడుగులు వేసిన సీతక్క తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. అనతి కాలంలోనే ఆ పార్టీలో రాష్ట్ర స్ధాయి మహిళా నేతగా పేరు సంపాదించుకొని తొలిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, రాజకీయ దిగ్గజం అజ్మీర చందులాల్ పై విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో రెండో సారి చందులాల్‌తో తలపడిన సీతక్క, ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముచ్చటగా మూడోసారి బరిలో దిగిన అనసూయ, ముందస్తు ఎన్నికల్లో మాజీ మంత్రి చందులాల్ పై విజయం సాధించారు. అయితే, ఇటీవ‌లి పరిణామాలు ఆమె టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపేందుకు కార‌ణంగా మారాయంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలుపొందింది. సీతక్కతో పాటు భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచారు. అయితే, టీఆర్ఎస్ ఆపరేషన్‌కు ఆకర్శితులైన గండ్ర టీఆర్ఎస్‌లో చేరారు. మ‌రోవైపు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ములుగును జిల్లా కేంద్రంగా ప్రకటించింది. అయితే, సీతక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండడంతో, ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదట. ఈనేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆమె పెద్దగా ఆసక్తి కనబర్చలేదని తెలుస్తోంది. దీంతో సీతక్కతో టీఆర్ఎస్ నేతలు మంతనాలు సాగిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఆమె కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English