ఏపీలో జ‌గ‌న్‌దే అధికారం..పూర్తిగా న‌మ్మ‌లేమంటున్న రోజా

ఏపీలో జ‌గ‌న్‌దే అధికారం..పూర్తిగా న‌మ్మ‌లేమంటున్న రోజా

దేశ‌వ్యాప్తంగా హోరాహోరీగా సాగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ ముగిసిన సంగ‌తి తెలిసిందే. ఏడో విడ‌త పోలింగ్ ముగిసిన అనంత‌రం వివిధ మీడియా సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల చేశాయి. ఏపీలో జ‌గ‌న్‌దే అధికార‌మ‌ని మెజార్టీ మీడియా సంస్థలు జోస్యం చెప్పాయి. ఎంపీ సీట్ల‌లోనూ వైసీపీ అధిక వాటా కైవ‌సం చేసుకుంటుంద‌ని ప్ర‌క‌టించాయి. అయితే, తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై వైసీపీ నేత రోజా ఆస‌క్తిక‌రంగా స్పందించారు.

ఓ మీడియా ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్‌ను గుడ్డిగా నమ్మలేమని రోజా అన్నారు. వ్యక్తిగతంగా ఇటువంటి సర్వేలను తాను విశ్వసించనని తేల్చి చెప్పారు. కానీ.. 100 శాతం ఖచ్చితంగా ఏపీకి జగన్‌నే ముఖ్యమంత్రి అవుతారని తేల్చి చెప్తున్నారు. త‌మకు అనుకూలంగా లేని పోల్స్ గురించి మేము డల్ అయిపోమని అన్నారు. పాదయాత్రలో, పలు బహిరంగ సభల్లో ప్రజల్లో జగన్‌కు ఉన్న విశ్వసనీయతను చూశామని, ఒక్కసారి ఛాన్స్ ఇద్దామనే ఆలోచనలో వాళ్లున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్రం అప్పుడే వేరు పడిందని.. జగన్ ఏం చేయలేరని.. చంద్రబాబుకి ఓట్లు వేసి గెలిపిస్తే...ఇప్పుడేం చేశారని రోజా ప్రశ్నించారు. జగన్ సీఎం అవుతారని..తాము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని చెప్పారు. జగన్‌ను గెలిపిస్తే మళ్లీ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారని రోజా తెలిపారు.

అయితే, ఎగ్జిట్ పోల్స్‌తో వైసీపీ నేత‌లంతా అధికారం ద‌క్కిన భావ‌న‌లోనే ఉండ‌గా, రోజా చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌పై పార్టీ ముఖ్య నేత‌లు స‌హా క్షేత్ర‌స్థాయిలోని నాయ‌కులు సైతం ఖుష్ అవుతుంటే...గుడ్డిగా న‌మ్మ‌లేమ‌ని రోజా వ్యాఖ్యానించ‌డం...రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుండా వైసీపీ నేత‌ల్లోనూ చ‌ర్చ‌కు దారితీస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English