లెక్క తప్పిందో... లగడపాటి కనిపించరంతే

లెక్క తప్పిందో... లగడపాటి కనిపించరంతే

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ఆదివారంతో ముగిసిపోయింది. అప్పటిదాకా ఎగ్జిట్ పోల్స్ కోసం ఉగ్గబట్టిన జనంలో మరింతగా ఆసక్తి రేకెత్తిస్తూ ఆదివారం నాటి పోలింగ్ ముగిసిందో, లేదో... ఆంధ్రా ఆక్టోపస్ గా పేరొందిన బెజవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. తిరుపతి వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన ఆధ్వర్యంలోని ఆర్జీ ఫ్లాష్ టీం రూపొందించిన ఎగ్జిట్ పోల్స్ ను ఆయన వెల్లడించారు.

మొదటి నుంచి చెబుతున్నట్లుగానే... ఈ సారి ఏపీలో మరోమారు టీడీపీ అధికారం చేపడుతుందని లగడపాటి చెప్పారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తున్న లగడపాటి నోట ఈ మాట వినిపించగానే... మీడియా నుంచి ఓ ఆసక్తికరమైన ప్రశ్న లగడపాటి వైపు దూసుకొచ్చింది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మీ లెక్క తప్పింది కదా... ఇప్పుడు కూడా అదే జరిగితే... ఏం చేస్తారంటూ దూసుకువచ్చిన ఆ ప్రశ్న... లగడపాటిని కాస్తంత ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. అయితే ఆన్సర్ చెప్పకుండా వెళితే... ఏళ్లుగా సర్వేలు చేస్తూ... నిష్పక్షపాత అంచనాలను వెలువరిస్తున్నారన్న పేరును చెడగొట్టుకున్నట్టే కదా.

అందుకేనేమో... లగడపాటి ఈ ప్రశ్నకు సూటిగానే సమాధానం చెప్పారు. ఈ సారి గనుక తన అంచనాలు తప్పితే... ఇకపై మరోమారు సర్వేలంటూ చెప్పనంటూ ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. అంటే... మొన్నటి తెలంగాణ ఎన్నికల సందర్భంగా తగిలిన దెబ్బ... ఇప్పుడు కూడా తగిలితే... లగడపాటి సర్వేలు ఇకపై కనిపించవన్న మాట. ఆర్జీ ఫ్లాష్ టీం దుకాణం బంద్ అయిపోయినట్టేనన్న మాట. మరి లగడపాటిని ఈ ఎన్నికలు అస్త్రసన్యాసం చేయిస్తాయో, లేదంటే ఆయన అంచనాలు వాస్తవమేనని తేలి మరింత విశ్వసనీయతను పెంచుతాయో... 23న తేలుతుందన్న మాట.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English