నేను స్వలింగ సంపర్కురాలిని : ద్యుతి చంద్

నేను స్వలింగ సంపర్కురాలిని : ద్యుతి చంద్

ద్యుతి చంద్.. క్రీడాభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. పుట్టి పెరిగింది ఒరిస్సాలో అయినా.. ఆమె అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందింది, విజయాలు సాధించి పేరు సంపాదించింది హైదరాబాద్‌ నుంచే. ప్రస్తుతం మహిళల 100 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు ద్యుతి పేరిటే ఉంది. తన విజయాలతో పాటు వివాదాల ద్వారా కూడా ఆమె వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమెలో పురుష హార్మోన్లు అధికంగా ఉన్నాయంటూ కొన్నేళ్ల కిందట నిషేధం పడటం.. కోర్టులో కేసు గెలిచి మళ్లీ ద్యుతి ట్రాక్ మీదికి రావడం.. విజయాలు సాధించడం తెలిసిన సంగతే. ఐతే ఇప్పుడు ఓ సంచలన ప్రకటనతో ఆమె మళ్లీ వార్తల్లో నిలిచింది. తాను స్వలింగ సంపర్కురాలిని అని ఆమె ప్రకటించింది. విదేశాల్లో ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం మామూలే కానీ.. మన దేశంలో ఒక స్పోర్ట్స్ పర్సన్ స్వలింగ సంపర్కురాలినని ప్రకటించడం ఇదే తొలిసారి.

తాను తన గ్రామానికే చెందిన ఓ అమ్మాయితో మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ద్యుతి ప్రకటించింది. తమ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణమని.. తాము జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నామని ఆమె చెప్పింది. మేజర్ అయిన ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉందని.. అలాగే తామిద్దరం కూడా ఒకరితో ఒకరు జీవితం పంచుకోవాలని అనుకున్నామని.. ఈ ఏడాది జరిగే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌ ముగిసిన అనంతరం ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని ద్యుతి వెల్లడించింది.

ఐతే ద్యుతి నిర్ణయాన్ని ఆమె తల్లి అకుజి చంద్ తప్పుబట్టింది. ఆమె నిర్ణయాన్ని తమ కుటుంబమంతా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది. తాము వ్యతిరేకించడంతో కుటుంబంతో సంబంధాలు తెంచుకోవడానికి కూడా ద్యుతి వెనుకాడలేదంది. ద్యుతి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి తనకు మనవరాలు అవుతుందని.. కూతురికి, మనవరాలికి పెళ్లి చేయడానికి ఏ తల్లి అయినా ఎలా ఒప్పుకుంటుందని ఆమె ప్రశ్నించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English