ఎగ్జిట్‌పోల్స్‌లో నిజ‌మెంత‌...ఆ మాయ‌లో నుంచి బ‌య‌ట‌కు రండి

ఎగ్జిట్‌పోల్స్‌లో నిజ‌మెంత‌...ఆ మాయ‌లో నుంచి బ‌య‌ట‌కు రండి

సార్వ‌త్రిక ఎన్నిక‌లకు సంబంధించి వివిధ సంస్థ‌లు త‌మ అంచ‌నాల‌తో కూడిన ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ప్రధానిగా నరేంద్రమోదీ మళ్లీ అధికారాన్ని చేపడుతారని పరోక్షంగా పేర్కొన్నాయి. దాదాపు 15 సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించగా, మూడు మినహా అన్ని సంస్థలు ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీ లభిస్తుందని అంచనా వేశాయి. మూడు సంస్థలు మాత్రమే హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశముందని పేర్కొన్నాయి.

అయితే, ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకే ఓటర్లు పట్టం కట్టనున్న నేప‌థ్యంలో దీంట్లో నిజమెంత? ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పేదంతా వాస్తవమేనా? అంటే కాదనే సమాధానం వస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. ముఖ్యంగా 2004, 2009 ఎన్నికల్లో చాలా వరకు ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు వాస్తవ ఫలితాలకు పూర్తి భిన్నంగా వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఎగ్జిట్ పోల్స్ ఓటరు నాడిని కచ్చితంగా అంచనా వేయలేకపోయాయి. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ.. సీట్ల విషయంలో లెక్కలు తప్పాయి. ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ 282 స్థానాలతో విస్పష్ట మెజారిటీ సాధించింది. మొత్తంగా ఎన్డీయేకి 336 స్థానాలు దక్కాయి. యూపీఏ 60 సీట్లకే పరిమితమైంది.

కాగా, ప‌లువురు జాతీయ నేత‌లు ఈ ఎగ్జిట్ పోల్స్‌పై ఘాటుగా స్పందించారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పందిస్తూ ``మళ్లీ ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం ఉట్టిదే. వాటిని ఎవరూ నమ్మొద్దు. ఈవీఎంలను దుర్వినియోగపర్చడం లేదా తారుమారు చేయడం కోసం ఈ సర్వేలను పావుగా వాడుకోవాలని చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఆత్మైస్థెర్యాన్ని కోల్పోకుండా ఐక్యంగా ఉండాలి`` అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేత శశిథరూర్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో ఎగ్జిట్ పోల్స్‌ తప్పని రుజువైందన్నారు. ``ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు. ఈ విషయం తాజాగా ఆస్ట్రేలియాలో రుజువైంది. అక్కడ దాదాపు 56 సర్వేలు తప్పని తేలాయి. భారత్‌లో ప్రజలు సర్వే చేసే వారికి నిజాన్ని చెప్పడానికి భయపడుతారు. సర్వే చేసేవాళ్లు ప్రభుత్వ మనుషులనుకొని వాస్తవాన్ని చెప్పరు``అని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్‌ను తప్పుబట్టడం లేదు కానీ టీవీని స్విచ్ ఆఫ్ చేసే సమయం వచ్చిందని ఎట‌కారం ఆడారు.` సోషల్ మీడియా నుంచి బయటికి రండి. ఓట్ల లెక్కింపు జరిగే ఈనెల 23 వరకు వేచిచూద్దాం` అని వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English