లగడపాటి సేఫ్ గేమ్ అడుతున్నట్లేగా

లగడపాటి సేఫ్ గేమ్ అడుతున్నట్లేగా

ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన బెజవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పొలిటీషియన్ గా కంటే కూడా సర్వే మాస్టర్ గానే మంచి పేరు సంపాదించుకున్నారని చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తుగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు కూటమికి మద్దతుగా నిలిచిన లగడపాటి... అప్పటిదాకా తాను వ్యవహరించిన తీరుకు నిజంగానే భిన్నంగా వ్యవహరించారు. సర్వేలన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినా... పోలింగ్ కు ముందు రోజు ఓటర్లను ప్రభావితం చేసేలా మహా కూటమి విజయం సాదిస్తుందంటూ తనదైన శైలిలో వ్యవహరించి తనకు తానే దెబ్బేసుకున్నారు.

మరి ప్రస్తుతానికి వస్తే... ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆది నుంచి కూడా వైసీపీనే విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు కోడై కూశాయి. తాజాగా కాసేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్ ఫలితాల్లోనూ లగడపాటి ఆర్జీ ఫ్లాష్ టీం, మరో సర్వే సంస్థ తప్పించిన మిగిలిన సంస్థలన్నీ కూడా వైసీపీదే విజయమంటూ చెబుతున్నాయి. అయితే లగడపాటి మాత్రం టీడీపీదే అధికారమని చెబుతున్నారు. తిరుపతి కేంద్రంగా తన ఎగ్జిట్ ఫలితాలను విడుదల చేసిన లగడపాటి ఈ ఎన్నికల్లో విపక్ష వైసీపీ గట్టి పోటీ ఇచ్చిందని చెబుతూనే... ఎంత గట్టి పోటీ ఇచ్చినా గానీ వైసీపీ అధికారంలోకి రాలేదని చెప్పేశారు.

అయితే మరి తెలంగాణలో మాదిరి ఇక్కడ కూడా తన అంచనాలు తప్పితే పరిస్థితి ఏమిటి? ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పటిదాకా ఆర్జీ ఫ్లాష్ టీంకు వచ్చిన ప్రతిష్ఠ ఒక్కసారిగా గంగలో కలిసిపోతే ఎలా? ఇలా అన్ని కోణాల్లో ఆలోచించిన లగడపాటి పక్కా ప్లాన్డ్ గా సేఫ్ గేమ్ ను ఎంచుకున్నారని చెప్పాలి. వైసీపీ గెలవబోదని, టీడీపీ గెలుస్తుందని చెప్పిన లగడపాటి... తాను చెబుతున్నది పక్కా ఫలితాలు కాదని, కేవలం అంచనాలు మాత్రమేనని పదే పదే చెప్పారు. అంతేకాకుండా తాను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకిని కాదని, అలాగని ఏ ఒక్క పార్టీకి తాను అనుకూలంగా లేనని కూడా చెబుతున్నారు.

ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనూ మంచి సంబంధాలే నెరపుతున్నట్లుగా కూడా లగడపాటి చెబుతున్నారు. అయినా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పే సమయంలో ఇవన్నీ ఎందుకంటే.. సేఫ్ గేమ్ లో భాగంగానేనట. ఒక వేళ తాను చెప్పిన అంచనాలు తప్పని తేలితే... ఈ మాటలు తనను కాపాడతాయి కదా. అందుకే తెలంగాణలో తగిలిన దెబ్బ కారణంగా ఏపీలో సేఫ్ గేమ్ ను ఎంచుకున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English