లగడపాటిని లైట్ తీసుకున్న వైసీపీ.. కారణం ఇదే..!

లగడపాటిని లైట్ తీసుకున్న వైసీపీ.. కారణం ఇదే..!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు. రాజకీయ నేతల కంటే రాష్ట్ర ప్రజలే ఈ ఎన్నికల ఫలితాలపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మరో ఐదు రోజుల్లో ఏపీలో కింగ్ ఎవరో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియా ముందుకు వచ్చారు. మే 19న ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తానని గతంలో ప్రకటించారు. దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించడానికే ఆయన ఒకరోజు ముందు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను వెల్లడించారు. అయితే, ఏ పార్టీ గెలవబోతుందనే విషయాన్నైతే ప్రకటించలేదు కానీ, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సంక్షేమానికే పెద్ద పీట వేశారని, ఈ ఎన్నికల ఫలితాల్లో ఇదే భారీగా ప్రభావం చూపుతుందని లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు.

ఎన్నికల సమయంలో లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడితే అదో సంచలనం అయిపోతుంది. గతంలో ఆయన చేసిన సర్వేలు.. వాటి ఫలితాలే దీనికి కారణం. అలాంటిది ఆయన సర్వేలను కానీ, తాజాగా జరిపిన మీడియా సమావేశాన్ని కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు లైట్ తీసుకున్నారు. వాస్తవానికి ఆయన చేసిన సర్వేలు చాలా వరకు నిజమవుతూ వచ్చాయి. అయితే, రెండేళ్ల నుంచి లగడపాటి.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిపోయారు. ఇది ముందస్తు ఎన్నికల సమయంలో సుస్పష్టమైంది. అప్పుడు అన్ని సర్వేలు తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా ఫలితాలను వెల్లడిస్తే.. లగడపాటి మాత్రం తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్న ప్రజాకూటమికి గెలుస్తుందని చెప్పారు. అప్పుడే ఆయన విశ్వాసాన్ని కోల్పోయారు.

 ఆ తర్వాత లగడపాటి, ఓ ప్రముఖ న్యూస్ చానెల్ ఎండీతో కలిసి రహస్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వెళ్లడం ఈ మధ్య సంచలనం అయింది. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికలో కూడా లగడపాటి అంతర్గత సర్వే నిర్వహించారని ఎన్నికల సమయంలో ప్రచారం జరిగింది. దీనికితోడు, కొన్ని పత్రికలు, న్యూస్ చానెల్స్ ఆయన.. టీడీపీకి వ్యూహకర్తగా మారిపోయారనే వార్తలు ప్రసారం చేశాయి. దీంతో లగడపాటి అంటే టీడీపీ మనిషి అనే ముద్ర పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేసినా.. ఏం చెప్పినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉంటుంది. అందుకే ఆ పార్టీ లగడపాటిని లైట్ తీసుకుందని తెలుస్తోంది. మరోవైపు, వాళ్ల మీడియాలో కూడా ఈ వార్తలను కవర్ చేయకపోవడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English