పవన్‌కు షాక్.. అన్న కంటే తక్కువే అన్న లగడపాటి

పవన్‌కు షాక్.. అన్న కంటే తక్కువే అన్న లగడపాటి

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎంతటి ఉత్కంఠను రేకెత్తించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఎన్నికల మాదిరిగానే ఇప్పుడు కూడా హోరాహోరీ పోరు జరిగింది. అయితే, అప్పుడు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధానంగా పోటీ జరగగా, ఇప్పుడు మాత్రం జనసేన పార్టీ ఎంటరయ్యింది. దీంతో ఇప్పుడు పోటీ త్రికోణంగా జరిగింది. ఈ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు ఎంతగానో శ్రమించాయి. అయితే, జనసేన మాత్రం సంస్థాగతంగా బలం పుంజుకోకున్నా.. ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన చేయాలని భావించింది. కర్నాటకలో మాదిరిగా ఏపీలో చక్రం తిప్పాలని భావించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికల తర్వాత కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు ఓ సీనియర్ నేత కోలుకోలేని షాక్ ఇచ్చారు.

 ఆయనే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. విభజన తర్వాత రాజకీయాలకు గుడ్‌ బై చెప్పేసిన ఆయన సర్వేల రూపంలో మాత్రం ప్రజలకు దగ్గరలోనే ఉన్నారు. ఫలితం ఎలా ఉన్నా ఆయన సర్వే అంటే ప్రజల్లోనే కాకుండా రాజకీయ పార్టీల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంటుంది. వాస్తవానికి తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల కోసం చేసిన సర్వే ఫలితాలు తప్పు మిగతా సర్వేలన్నీ దాదాపుగా నిజమవుతూ వచ్చాయి. 2014లో ఏపీలో చేసిన సర్వేల్లో చాలా సంస్థలు వైసీపీ విజయం సాధిస్తుందని పేర్కొనగా, లగడపాటి మాత్రం టీడీపీనే గెలుస్తుందని చెప్పారు. సర్వేలు చేయించడంలో ఫలితాలను కచ్చితంగా అంచనా వేయడంలో ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ నిర్దిష్టంగా వ్యవహరిస్తారనే పేరుంది. ఆయన తాజా ఎన్నికలపైనా సర్వే నిర్వహించారు.

 దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేనకు ప్రజారాజ్యంకు వచ్చిన స్థానాల కంటే తక్కువే వస్తాయని చెప్పారు. అంతేకాదు,  ‘‘ఆంధ్రప్రదేశ్‌లో కచ్చితమైన మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. హంగ్ వచ్చే అవకాశమే లేదు. తెలుగు ప్రజలు.. సమైక్య రాష్ట్రంలోగానీ, విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో గానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్పష్టమైన తీర్పునే ఇచ్చారు. గజిబిజి తీర్పును ఎప్పుడూ ఇవ్వలేదు. ఒక పార్టీకే స్పష్టంగా పట్టం కట్టారు. అలాగే ఏపీ ఎన్నికల్లో కూడా ఒక్క పార్టీకే స్పష్టమైన మెజారిటీ ఇవ్వబోతున్నారని నేను అనుకుంటున్నాను’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పవన్ కల్యాణ్‌కు షాక్ తగిలినట్లైంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English