యూ ట్యూబ్ లో శివాజీ!... ఎక్క‌డున్నారో చెప్ప‌లేదు!

యూ ట్యూబ్ లో శివాజీ!... ఎక్క‌డున్నారో చెప్ప‌లేదు!

టీవీ 9 వివాదంలో అడ్రెస్ లేకుండా పోయిన ర‌విప్ర‌కాశ్ ఇప్ప‌టిదాకా ఏ ఒక్క‌రికి క‌నిపించ‌కుండా పోతే... ఆయ‌న‌తో పాటే టీవీ 9 కొత్త యాజ‌మాన్యాన్ని అడ్డుకునేందుకు యత్నించిన సినీ నటుడు శివాజీ మాత్రం యూ ట్యూబ్ లో ప్ర‌త్య‌క్ష‌మైపోయారు. కాసేప‌టి క్రితం మొత్తం ఎపిసోడ్ పై వివ‌ర‌ణ ఇస్తూ 7.30 నిమిషాల నిడివి ఉన్న వీడియోను శివాజీ యూట్యూబ్ లో విడుద‌ల చేశారు. నున్న‌టి గుండుతో క‌నిపించిన శివాజీ... తిరుమ‌ల‌కు వెళ్లి వెంక‌న్న‌కు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్న‌ట్లుగా వివ‌ర‌ణ ఇచ్చారు. అంతేకాకుండా స‌న్ స్ట్రోక్ (వ‌డ‌దెబ్బ‌) కార‌ణంగా తాను ఇంటికే ప‌రిమిత‌మ‌య్యాన‌ని కూడ వివ‌ర‌ణ ఇచ్చారు.

కేసుల‌ను చూసి తాను భ‌య‌ప‌డి పారిపోయిన‌ట్టుగా కొన్ని మీడియా సంస్థ‌లు చేస్తున్న ప్ర‌చారంలో ఎలాంటి వాస్త‌వం లేద‌ని కూడా శివాజీ చెప్పుకొచ్చారు. అయినా షేర్ల‌కు సంబంధించి త‌న‌కు, ర‌విప్ర‌కాశ్ కు మ‌ధ్య జ‌రుగుతున్న చిన్న సివిల్ పంచాయ‌తీని ఇప్పుడు అంతా క‌లిసి క్రిమిన‌ల్ కేసుగా మార్చే య‌త్నం చేస్తున్నార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. ర‌విప్ర‌కాశ్, త‌న‌కు మ‌ధ్య జ‌రుగుతున్న వివాదంలో ఇత‌రుల‌కు ఏమిటి సంబంధం అంటూ కూడా ఆయన త‌న‌దైన ప్ర‌శ్న‌లు సంధించారు. కొంద‌రు కావాల‌ని త‌న‌పై కుట్ర చేస్తున్నార‌ని, అందులో భాగంగానే కౌశిక్ రావు ఫిర్యాదు చేయ‌గానే తెలంగాణ పోలీసులు త‌న‌పైన కేసులు న‌మోదు చేశార‌ని ఆయ‌న ఆరోపించారు.

త‌మ‌కు అనుకూలంగా ఉన్న‌వారి విష‌యంలో పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నార‌ని, అదే త‌న లాంటి వారి ఫిర్యాదుల‌పై అస‌లు స్పందించ‌డ‌మే లేద‌ని కూడా శివాజీ ఆరోపించారు. త‌న‌పై జ‌రుగుతున్న కుట్ర‌లో తెలంగాణకు చెందిన వారితో పాటు ఏపీకి చెందిన కొంద‌రు కూడా ఉన్నార‌ని ఆయ‌న ఆరోపించారు. హైద‌రాబాద్ లో త‌న‌కు స్థాన బ‌లం లేద‌ని ఒప్పేసుకున్న శివాజీ... ఆ కార‌ణంగానే త‌న‌ను తెలంగాణ పోలీసులు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని ఆరోపించారు. వ‌డ‌దెబ్బ కార‌ణంగా ఇప్ప‌టికే నెలా 10 రోజులుగా బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితిలో ఉన్నాన‌ని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాన‌ని, త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని, ఆ కేసుల‌ను ధైర్యంగా ఎదుర్కొంటాన‌ని కూడా శివాజీ చెప్పుకొచ్చారు.

త‌న‌కు ఆరోగ్యం బాగా లేని విష‌యం త‌న ముఖంలోనే క‌నిపిస్తుంది క‌దా అంటూ కూడా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేసుల గురించి ఇంత వివ‌ర‌ణ ఇచ్చిన శివాజీ... అస‌లు ప్రస్తుతం తాను ఎక్క‌డున్నాన‌న్న విష‌యాన్ని మాత్రం ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ మెయిళ్లను పోలీసులు ఓపెన్ చేసిన విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించిన శివాజీ... త‌న ఈ మెయిళ్ల‌ను త‌న ప్ర‌మేయం లేకుండా తెరవ‌గ‌లిగిన పోలీసులు... అందులోని విష‌యాన్ని మాత్రం మార్చ‌లేరా? అంటూ కొత్త లాజిక్ లు తీశారు. మొత్తంగా ర‌విప్ర‌కాశ్ లాగే సైలెంట్ గా ఉంటే స‌రిపోయేది గానీ... ఇలా యూట్యూబ్ వీడియోలో ప్ర‌త్య‌క్ష‌మై శివాజీ సంచ‌ల‌న‌మే రేపార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English