భారత్ లో ఒమిక్రాన్ తొలి కేసు…హైదరాబాద్ లో హై అలర్ట్

కరోనా సెకండ్ వేవ్ నుంచి, డెల్టా వేరియంట్ సృష్టించిన విధ్వంసం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా పూర్తిగా కోలుకోక ముందే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అందరినీ కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 28 దేశాలకు శరవేగంగా విస్తరించిన ఈ వేరియంట్…తాజాగా భారత్ లోకి ప్రవేశించింది. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. బెంగళూరులో 44 ఏళ్లు, 66 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తుల్లో ఈ ఒమిక్రాన్ లక్షణాలు గుర్తించామని తెలిపింది.  దీంతో, ప్రజలను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ చేస్తున్నాయి.

మరోవైపు, హైదరాబాద్ కూ ఒమిక్రాన్ భయం పట్టుకుంది. యూకే నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే, అది ఒమిక్రాన్ వేరియంట్ అని ఇంకా నిర్ధారణ కాలేదు. ఆమెను హైదరాబాదులోని టిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆమె శాంపిల్స్ ను జెనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించామని తెలిపారు. అది ఒమిక్రాన్ వేరియంటా? కాదా? అన్నది మరో మూడు రోజుల్లో తేలుతుందని వెల్లడించారు.

ఆ మహిళ రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అని, ఆమె బంధువుకు నిర్వహించిన టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని చెప్పారు. తెలంగాణకు కూడా ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ నేపథ్యంలో హైదరాబాద్ లో నేటి నుంచి మాస్క్ పెట్టుకోకుంటే రూ. వెయ్యి ఫైన్ విధిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు ధరించకపోతే మన నిర్లక్ష్యానికి మనమే మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని, అది ఆత్మహత్యతో సమానమని షాకింగ్ కామెంట్లు చేశారు. ఒమిక్రాన్ బారిన పడిన రిస్క్ దేశాల నుంచి హైదరాబాదుకు వచ్చిన 239 మంది ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.