కేటీఆర్ ఫోక‌స్‌...కేవ‌లం జాతీయ రాజ‌కీయాలేనా?

కేటీఆర్ ఫోక‌స్‌...కేవ‌లం జాతీయ రాజ‌కీయాలేనా?

సోష‌ల్ మీడియాలో చురుకుగా స్పందించే టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియాలో పెద్ద‌గా క‌నిపించ‌ని సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌లు, పార్టీకి సంబంధించిన కార్య‌క్ర‌మాల‌ కార‌ణంగా కావచ్చు లేదా మ‌రేదైనా కార‌ణం అయి ఉండ‌వ‌చ్చు కానీ...ఇటీవ‌ల కేటీఆర్ పెద్ద‌గా మీడియాతో రియాక్ట్ అవ‌డం లేదు. సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉండే కేటీఆర్‌...రాష్ట్రంలోని వివిధ ప‌రిణామాల‌పై ట్విట్ట‌ర్లో త‌న అభిప్రాయాలు పంచుకుంటుంటారు. అయితే, అలా సొంత రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై స్పందించ‌ని కేటీఆర్‌...జాతీయ రాజ‌కీయాల‌పై మాత్రం స్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, సినీన‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ త‌మిళ‌నాడులో ఓ ఎన్నిక‌ల స‌భ‌లో మాట్లాడుతూ స్వ‌తంత్ర భార‌తంలో మొట్ట‌మొద‌టి హిందూ ఉగ్ర‌వాది గాడ్సే అని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. క‌మ‌ల్ చేసిన ఆ కామెంట్ దుమారం రేపింది. కాగా, భోపాల్ నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న ప్ర‌గ్యాసింగ్ ఠాకూర్  మ‌హాత్మాగాంధీని హ‌త్య చేసిన నాథూరామ్ గాడ్సే దేశ భ‌క్తుడు అని తెలిపారు. ప్ర‌జ్ఞా ఓ రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ గాడ్సే దేశ‌భ‌క్తుడు అని, అత‌ను దేశ భ‌క్తుడిగానే ఉంటార‌ని, అత‌న్ని ఉగ్ర‌వాదిగా పిలుస్తున్న‌వారు త‌మ‌ను తాము విశ్లేషించుకోవాల‌ని ప్ర‌గ్యాసింగ్ థాకూర్ తెలిపారు. గాడ్సేను ఉగ్ర‌వాది అన్న వ్య‌క్తుల‌కు ఎన్నిక‌ల్లో గ‌ట్టి గుణ‌పాఠం చెప్పాల‌ని థాకూర్ చెప్పారు.

అయితే, ఈ కామెంట్ల‌పై కేటీఆర్ ట్విట్ట‌ర్లో రియాక్ట‌య్యారు. ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. ఆమె వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. ఆమె వ్యాఖ్యలు హేయమైనవన్నారు. జాతిపితను అవమానించినందుకు ప్రగ్యా సింగ్ యావత్ జాతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ భావజాలమున్నా కొన్ని పరిధులు దాటకూడదని కేటీఆర్ హితువు పలికారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని ప‌రిణామాలు జ‌రుగుతుంటే ఏ ఒక్క‌దానిపై స్పందించ‌ని కేటీఆర్..జాతీయ రాజ‌కీయాల‌పై మాత్రం స్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English