రామోజీపై వార్ డిక్లేర్ చేసిన జ‌గ‌న్‌

రామోజీపై వార్ డిక్లేర్ చేసిన జ‌గ‌న్‌

మీడియా మొఘ‌ల్ రామోజీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ టార్గెట్ చేశారా?  కొద్దికాలం క్రితం రామోజీ.. జ‌గ‌న్ ల మ‌ధ్య చేసుకున్న అప్ర‌క‌టిత విమ‌ర్శ‌ల విర‌మ‌ణ (ఇష్టారాజ్యంగా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు.. నింద‌లు)కు మంగ‌ళం పాడుతూ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారా? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఓప‌క్క తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అండ‌.. మ‌రోవైపు ఏపీలో త‌న చేతికి ప‌వ‌ర్ రావ‌టం ఖాయ‌మ‌న్న భావ‌న‌కు వ‌చ్చేసిన జ‌గ‌న్.. రామోజీకి తానేంటో చెప్పేందుకు తెగ తాప‌త్ర‌య ప‌డుతున్నారా?  అవ‌స‌రానికి మించిన అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించి మీడియా మొఘ‌ల్ తో పెట్టుకోవ‌టానికి యుద్ధ భేరీని మోగించారా?  తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం.. రానున్న రోజుల్లో జ‌గ‌న్‌.. రామోజీల మ‌ధ్య కొత్త వార్ కు తెర తీయ‌నుందా? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రామోజీ.. జ‌గ‌న్ ల మ‌ధ్య శ‌త్రుత్వం ఇప్ప‌టిది కాదు. రాజ‌కీయ వైరుధ్యంతో పాటు.. భిన్న భావ‌జాలం.. ఒక‌రికొక‌రు పొస‌గ‌ని తీరు జ‌గ‌న్ తండ్రి వైఎస్ నుంచి వ‌చ్చింది. వైఎస్ పాద‌యాత్ర విష‌యంలో ఈనాడు వ్య‌వ‌హ‌రించిన తీరుతో.. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు ముగిసిన‌ట్లే అనుకున్నారు. కానీ.. వైఎస్ ప్ర‌భుత్వంలో చోటు చేసుకున్న ప‌రిణామాలతో రామోజీ మీడియా సంస్థ‌లు.. వాటి గురించి వార్త‌ల రూపంలో రాయ‌టం.. దీనిపై వైఎస్ అసంతృప్తికి గురి కావ‌టం.. అనంత‌రం రామోజీని ఇబ్బంది పెట్టే అంశాల్ని ఒక్కొక్క‌టిగా తెర మీద‌కు తీయ‌టం ఒక ఎత్తు అయితే.. రామోజీ మీడియా సంస్థ‌కు పోటీగా భారీ ఖ‌ర్చుతో సొంత మీడియా సంస్థ‌ను ఏర్పాటు చేశారు.

ఇలా ఇరువురి మ‌ధ్య మొద‌లైన వార్ నేటికి కొన‌సాగుతోంది. అయితే.. మూడేళ్ల క్రితం ఇరు వ‌ర్గాల‌కు సంబంధించిన వారు చొర‌వ‌తో.. ఒక‌రిపై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకునే ధోర‌ణికి స్వ‌స్తి ప‌ల‌కాల‌న్న సూచ‌న మేర‌కు రెండు వ‌ర్గాలు రాజీకి వ‌చ్చిన‌ట్లుగా చెబుతారు. అవ‌స‌రం లేకున్నా.. టార్గెట్ చేసిన‌ట్లుగా  ఎవ‌రిపై ఎవ‌రు రాత‌లు రాసుకోకూడ‌ద‌ని.. ఒకరి మ‌ర్యాద‌ను మ‌రొక‌రు దెబ్బ తీసుకోవ‌ద్దన్న‌ ఒప్పందానికి వ‌చ్చిన‌ట్లు చెబుతారు.

ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా త‌ర్వాత చోటు చేసుకున్నప‌రిణామాలు చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. నాటి నుంచి నేటి వ‌ర‌కూ ఎవ‌రూ ఎవ‌రిని దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించ‌కుండా ఉన్న‌ట్లుగా క‌నిపించింది. ఎన్నిక‌ల వేళ‌.. ఎవ‌రి ఎజెండాలు వారికి ఉన్నా.. హ‌ద్దులు దాట‌కుండానే ఉన్న‌ట్లు చెప్పాలి. ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌కు మ‌రో వారం వ్య‌వ‌ధి ఉన్న వేళ‌.. అనూహ్యంగా రామోజీని.. బాబును టార్గెట్ చేసేలా జ‌గ‌న్ మీడియా నుంచి వ‌చ్చిన క‌థ‌నం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

తాజాగా రామోజీతో బాబు భేటీ వెనుక‌.. టీవీ9 ర‌విప్ర‌కాశ్ విష‌య‌మై మీడియా మొఘ‌ల్ ను రాజీ చేయాల‌ని కోరిన‌ట్లుగా పేర్కొన్నారు. అన‌వ‌స‌ర‌మైన విష‌యాల్లో త‌లదూర్చే అల‌వాటు లేని రామోజీ.. చూస్తూ.. చూస్తూ.. టీవీ9 విష‌యంలో.. అందునా ర‌విప్ర‌కాశ్ ఎపిసోడ్ విష‌యంలో క‌లుగ‌చేసుకునే అవ‌కాశం లేదు. మార్గ‌ద‌ర్శి ఎపిసోడ్ లో ర‌విప్ర‌కాశ్ నేతృత్వంలోని టీవీ9 తీరును రామోజీ ఇంకా మ‌ర్చిపోలేదంటారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ర‌విప్ర‌కాశ్ కోసం రామోజీని బాబు రాజీ చేయాల‌ని కోరుతారా? అన్న‌ది క్వ‌శ్చ‌నే.

టీవీ9 వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకుంటే.. ప‌వ‌ర్ స్టేష‌న్ ను ట‌చ్ చేసిన‌ట్లేన‌న్న విష‌యం రామోజీకి తెలియ‌ని విష‌యం కాదు. అలాంట‌ప్పుడు త‌న‌కు ఏ మాత్రం సంబంధం లేని విష‌యాల్లో రామోజీ క‌ల్పించుకునే ఛాన్సే ఉండ‌దని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో బాబును టార్గెట్ చేసే ప‌నిలో భాగంగా త‌న ప్ర‌స్తావ‌న తెచ్చిన జ‌గ‌న్ మీడియాపై రామోజీకి ఆగ్ర‌హం ఖాయంగా వ‌స్తుందంటున్నారు.

అధికారం చేతిలో రాక ముందే జ‌గ‌న్ మీడియా వ్య‌వ‌హ‌రించిన తీరు రామోజీని పున‌రాలోచ‌న‌లో ప‌డేలా చేయ‌టం ఖాయ‌మంటున్నారు. త‌న‌కు పొస‌గ‌ని ప్ర‌భుత్వం ప‌వ‌ర్లోకి వ‌స్తే.. రెండేళ్ల పాటు నెగిటివ్ వార్త‌లు రాయ‌ని విధానాన్ని ఎప్ప‌టినుంచో రామోజీ ఫాలో అవుతార‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ ఇందుకు మిన‌హాయింపు కాద‌న్న వాద‌న వినిపించింది.   తాజా ప‌రిణామం నేప‌థ్యంలో త‌న‌ను టార్గెట్ చేసిన జ‌గ‌న్ మీడియా పుణ్య‌మా అని ఇరువురి ప్ర‌ముఖుల మ‌ధ్య మ‌ళ్లీ వార్ మొద‌లైన‌ట్లేన‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English