కేసీఆర్‌ను ఆహ్వానించిన సోనియా...జ‌గ‌న్ ఏం చేస్తారు?

కేసీఆర్‌ను ఆహ్వానించిన సోనియా...జ‌గ‌న్ ఏం చేస్తారు?

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్ర‌శేఖ‌ర్ రావు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ముందు పెద్ద సంక‌టం వచ్చి ప‌డింద‌ని అంటున్నారు. ఢిల్లీ వేదిక‌గా మారుతున్న ప‌రిణామాలు..ఈ రెండు పార్టీల నేత‌ల‌కు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చాయ‌ని చ‌ర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ నాయ‌కురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో యాక్టివ్ అయి బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతూ ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 23న సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ భేటీకి కేసీఆర్‌,జ‌గ‌న్‌కు ఆహ్వానం అంద‌డ‌మే ఈ సంక‌టానికి కార‌ణ‌మంటున్నారు.

ఈ నెల 19తో లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఆ తరువాత మరో నాలుగు రోజులకు ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, 2014 ఎన్నికల్లో వచ్చిన విధంగా బీజేపీకి స్వతహాగా, ఏ పార్టీ అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లు రావని కాంగ్రెస్, బీజేపీ మిత్ర పక్షాలు అంచనా వేస్తున్నాయి. ఎన్డీయే ఈసారి అధికారం చేజిక్కించుకోవాలంటే మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి కావచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో, ఈ భేటీకి ఎన్డీయేతర పక్షాలను రావాల్సిందిగా సోనియా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అందులో బీజేడీ, వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీకి ఆహ్వానం అందినట్లు సమాచారం.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌తో కలిసొచ్చే పార్టీలను కలుపుకుపోయేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. 16కు 16 స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో తాము చెప్పిన వ్యక్తే ప్రధాని అవుతారనే ప్రచారాన్ని టీఆర్ఎస్ జోరుగా చేస్తోంది. అదే స‌మ‌యంలో, బీజేపీ వైపు కేసీఆర్ సైతం మొగ్గు చూపుతున్నార‌ని టాక్ వ‌స్తోంది. ఇదిలాఉండ‌గా, కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి ఎన్డీయే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే వైసీపీ అధినేత జగన్ బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

అయితే, హంగ్ ఖాయమంటూ స‌ర్వేలు తేల్చుతున్న త‌రుణంలో సోనియా రంగంలోకి దిగ‌డం, ఫలితాలు వచ్చిన వెంటనే తటస్థ పార్టీలను యూపీఏలోకి తెచ్చి.. తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని క‌స‌ర‌త్తు చేస్తూ కేసీఆర్‌, జ‌గ‌న్‌కు ఆహ్వానం అందించిన నేప‌థ్యంలో... ఈ ఇద్ద‌రు నేత‌లు ఏ విధంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారో వేచిచూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English