బాబు ప్రకటనతో జగన్‌కు వెల్లువెత్తుతున్న ఫోన్ కాల్స్

బాబు ప్రకటనతో జగన్‌కు వెల్లువెత్తుతున్న ఫోన్ కాల్స్

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుందన్న విషయం కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. ఎన్నికలు జరిగిన చాలా రోజులకు ఫలితాలు వస్తుండడంతో అటు ప్రజల్లో, ఇటు రాజకీయ నాయకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై కచ్చితమైన సర్వేలు రాకపోయినా.. అన్ని పార్టీలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ లోపు అన్ని పార్టీల అధినేతలు గెలుపోటములపై అంచనాలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే కొద్దిరోజులుగా పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం కూడా ఓ రెండు పార్లమెంట్ స్థానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

‘‘మొన్నటి ఎన్నికల్లో మనం విజయం సాధించేశాం. ఈ విషయం కౌంటింగ్‌ రోజు లాంఛనంగా ప్రకటిస్తారు. ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు నాలుగు రకాల సర్వేలు చేయించాం. అన్నింటిలోనూ టీడీపీకే అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. వాటి ప్రకారం 110 స్థానాలతో మన పార్టీ విజయం సాధించబోతుంది. అంతేకాదు, అన్నీ అనుకూలిస్తే 130-140 స్థానాలకు కూడా చేరుతుంది’’ ఇవీ.. సోమవారం హ్యాపీ రిసార్ట్స్‌లో నంద్యాల, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ స్థానాల నేతలతో సమీక్ష నిర్వహించిన సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. ఈ సమావేశంలో ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడారు. అంతేకాదు, నాయకుల్లో కూడా దానిని భారీగా నింపారు. దీంతో తెలుగుదేశం పార్టీ విజయం నిజమేనేమో అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

 ఇది తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం ఆందోళనను పెంచుతోంది. దీంతో ఆ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు కలవరపాటుకు గురవుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే చాలా మంది పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారట. ‘చంద్రబాబు అంత కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు.. మన ఓడిపోతామా.?’ అంటూ ఆయనను ప్రశ్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో వారికి జగన్ భరోసా ఇచ్చే విధంగా మాట్లాడుతున్నారని తెలిసింది. మొత్తానికి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ 21 జరిగే సమావేశంలో వైసీపీ అభ్యర్థులకు ఎలా ధైర్యం చెబుతారోనన్నది ఆసక్తికరంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English