కేసీఆర్ తో భేటీ!... స్టాలిన్ ఏమ‌న్నారంటే?

కేసీఆర్ తో భేటీ!... స్టాలిన్ ఏమ‌న్నారంటే?

జాతీయ స్థాయిలో స‌త్తా చాటుతామంటూ టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ఎంత గ‌ట్టిగా చెబుతున్నారో, అంత‌కంటే గ‌ట్టిగానే ఆయ‌న‌కు ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరిట భావ‌సారూప్య‌త క‌లిగిన పార్టీల‌తో జ‌ట్టు క‌ట్టి కేంద్రంలో చ‌క్రం తిప్పుతామంటూ కేసీఆర్ చాలా కాలంగానే చెబుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ దిశ‌గా ఆయ‌న చేస్తున్న విడ‌త‌ల వారీ చ‌ర్చ‌లు ఓ సారి ఫ‌లిస్తే... మ‌రోసారి దెబ్బ కొట్టేస్తున్నాయి. కేర‌ళ‌, త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లిన కేసీఆర్ కు కేర‌ళ నుంచి మంచి హ్యాండే ల‌భించ‌గా... త‌మిళ నాట మాత్రం ఊహించ‌ని షాక్ ఎదురైంది. ముందుగా అపాయింట్ మెంట్ అడిగిన కేసీఆర్ ను కాదు పొమ్మ‌న్న డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌... రెండో సారి అడిగితే కాద‌న‌లేక‌పోయారు.

అయితే ఈ భేటీలో ఏఏ అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌న్న విష‌యంపై ఇటు కేసీఆర్ గానీ, అటు స్టాలిన్ గానీ నిన్న‌ నోరు విప్ప‌లేదు. చెన్నైలోని స్టాలిన్ ఇంట జ‌రిగిన ఈ భేటీ దాదాపుగా గంట‌కు పైగానే సాగినా... భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడ‌కుండానే స్టాలిన్ ఇంటిలోప‌లికి వెళ్లిపోగా... ఎప్పుడూ మీడియాతో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ విష‌యాల గురించి మాట్లాడేందుకు ఆస‌క్తి చూపే కేసీఆర్ కూడా మీడియాతో మాట్లాడ‌కుండానే రిట‌ర్న్ ఫ్లైటెక్కేశారు. దీంతో కేసీఆర్ కు భారీ అవ‌మాన‌మే జ‌రిగి ఉంటుంద‌ని అంతా అనుకున్నారు. ఈ ఊహాగానం నిజమేన‌ని తాజాగా స్టాలిన్ తేల్చి పారేశారు. కేసీఆర్ తో జ‌రిగ‌న త‌న భేటీ మ‌ర్యాద‌పూర్వ‌క‌మేన‌ని, ఇందులో ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌ని ఆయ‌న కాసేప‌టి క్రితం కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అంతేకాకుండా కేసీఆర్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లేలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన స్టాలిన్‌... కేంద్రంలో కాంగ్రెస్ లేదంటే బీజేపీ లేకుండా ఏ ఒక్క పార్టీ గానీ, కూట‌మి గానీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశాలు లేనే లేవ‌ని తేల్చేశారు.

థర్ట్‌ ఫ్రంట్‌కు ఎలాంటి అవకాశాలు లేవని స్టాలిన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ లేదా బీజేపీ మద్దతు లేకుండా.. మూడో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఇక ఆ త‌ర్వాత కేసీఆర్ తో త‌న భేటీ గురించి కూడా చాలా క్లియ‌ర్ గానే మాట్లాడిన స్లాలిన్‌.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేసీఆర్ త‌న‌నేమీ కోర‌లేద‌ని కూడా సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. దైవ ద‌ర్శ‌నాల కోస‌మే కేసీఆర్ చెన్నై వ‌చ్చార‌ని, మ‌ర్యాద‌పూర్వ‌కంగానే కేసీఆర్ త‌న‌తో భేటీ అయ్యార‌ని కూడా స్టాలిన్ పేర్కొన్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా ఇప్ప‌టిదాకా కేసీఆర్ ఐదు రాష్ట్రాలు తిరిగితే ఎక్క‌డ కూడా ఈ త‌ర‌మా అవమానం జ‌ర‌గ‌లేదు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌కున్నా... కేసీఆర్ ఇమేజీని డ్యామేజీ చేసేలా ఏ ఒక్క‌రు కూడా మాట్లాడ‌లేదు. అయితే అందుకు విరుద్ధంగా స్టాలిన్ మాత్రం కేసీఆర్ ను భారీ దెబ్బ కొట్టేస్తూ... ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English