పవన్‌కు రిలీజ్‌కు ముందే సినిమా అర్థమైంది

పవన్‌కు రిలీజ్‌కు ముందే సినిమా అర్థమైంది

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికలపై ఎలాంటి నమ్మకంతో ఉన్నారు..? అసలు ఆయనకు ఎన్ని సీట్లు గెలుస్తామన్న దానిపై క్లారిటీ ఉందా..? కర్నాటకలో కుమారస్వామిలా ఏపీకి సీఎం అవుతానన్న పవన్ నమ్మకం నిజం కాబోతుందా..? ఈ ఎన్నికల తర్వాత ఆయన మౌనంగా ఉండడానికి కారణం ఏంటి..? గ్రామ స్థాయిలో జనసైనికులు తమ పార్టీ విజయంపై ఎలా స్పందిస్తున్నారు..? అసలు జనసేన ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా..? ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారితే పవన్ ఏ పార్టీకి మద్దతిస్తారు..? ఇంతకీ పవన్ మనసులో ఏముంది..? ఇవీ.. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్న ప్రశ్నలు. పోలింగ్ జరిగిన చాలా రోజుల తర్వాత వీటికి దాదాపుగా సమాధానం దొరికనట్లే అనిపిస్తోంది.

 ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. అభ్యర్థులు చెప్పిన విషయాలను విన్న ఆయన.. ఆ తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, ముఖ్యంగా ‘‘గెలుస్తాం’’, ‘‘ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాం’’, ‘‘చక్రం తిప్పుతాం’’ అని వ్యాఖ్యానించకుండా ఆయన ప్రసంగించారు. అసలు ఎన్ని సీట్లు వస్తాయో లెక్క పెట్టుకోలేదంటూనే మార్పునైతే తీసుకువచ్చామంటూ పవన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, జనసేన బాగా బలంగా ఉందని చెప్పుకున్నారు కానీ, ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయాన్ని మాత్రం చెప్పలేకపోయారు. దీంతో పవన్‌కు సినిమా అర్థమైపోయిందన్న టాక్ వినిపిస్తోంది.

 మొత్తానికి పవన్ ప్రసంగంలో గానీ, బాడీ లాంగ్వేజ్‌లో గానీ అస్సలు కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. దీంతో ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకునే ఆయన సైలెంట్ అయిపోయారన్నది స్పష్టమవుతోంది. మరోవైపు, గ్రామ స్థాయిలో మాత్రం జనసైనికులు అస్సలు తగ్గడం లేదు. ఈ ఎన్నికల్లో తామే గెలుస్తామంటూ చెప్పుకుంటున్నారు. పవన్ సీఎం కాబోతున్నారని అంటున్నారు. అయితే, ఇప్పటి వరకు పవన్ ఎన్నికలపై మాట్లాడకపోవడంతోనే వారు ఇలా ధీమా వ్యక్తం చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడేమో.. పవన్ సూచాయగా ఎన్నికల్లో జనసేన పరిస్థితి వెల్లడించడంతో అందరికీ అసలు విషయం అవగతమై ఉంటుంది. ఇక, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం పవన్ వ్యాఖ్యల తర్వాత ఊపిరి పీల్చుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English