కృప‌లానీ నుంచి జ‌గ‌న్ దాకా!... కాంగ్రెస్ ను చీల్చిందెందరో?

కృప‌లానీ నుంచి జ‌గ‌న్ దాకా!... కాంగ్రెస్ ను చీల్చిందెందరో?

శ‌త వ‌సంతాలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీని మ‌న రాజ‌కీయ విశ్లేష‌కులు గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ముద్దుగా పిలుచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పార్టీని గ్రాండ్ ఓల్డ్ పార్టీగానే కాకుండా అన్ని పార్టీల‌కు అమ్మ‌లాంటి పార్టీగా కూడా చెప్పుకోవ‌చ్చే. ఎప్పుడో దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు పురుడు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ... ఇప్ప‌టికీ దేశ రాజ‌కీయాల‌ను శాసించే స్థితిలోనే కొన‌సాగడమంటే గొప్పే క‌దా. దేశ స్వాతంత్య్రం కోస‌మే నాడు పుట్టిన ఈ పార్టీ... ప్ర‌స్తుతం దేశంలోని చాలా పార్టీల‌కు మాతృక కూడా. త‌న పేరును ఏమాత్రం వ‌దిలిపెట్ట‌కుండాన కొన‌సాగుతున్న కాంగ్రెస్ పార్టీ... ఇప్ప‌టిదాకా 70 సార్లు చీలిపోయింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం ఇంకా కొన‌సాగుతూనే ఉందంటే గొప్పే క‌దా. నిజంగానే కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీనే.

1951లో తొలిసారిగా ఈ పార్టీలో చీలిక రాగా... ఆ త‌ర్వాత ఏకంగా 70 సార్లు వ‌రుస‌గా, ఎడ‌తెరిపి లేకుండానే చీలిక‌ల‌కు గురైంది. అయినా కూడా త‌న అస్తిత్వాన్ని ఏనాడూ కోల్పోలేద‌నే చెప్పాలి. ఇక ఈ పార్టీని చీల్చిన పార్టీలు ఇప్పుడు దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో కీల‌క భూమిక పోషిస్తున్నాయి కూడా. 1951లో జేబీ కృప‌లానీ ఈ పార్టీని తొలిసారి చీల్చితే... మొన్న‌టికి మొన్న వైసీపీ అధినేత‌, ఏపీలో విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా చీల్చేశారు. మొత్తంగా ఎన్ని చీలికలు వ‌చ్చినా, ఎన్ని సార్లు కుట్లు ప‌డినా కూడా కాంగ్రెస్ పార్టీ త‌న‌దైన శైలిలో జాతీయ స్థాయిలో త‌న‌దైన శైలి కీల‌క భూమిక‌ను పోషిస్తూ వ‌స్తోంది. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత మెజారిటీ కాలం పాటు దేశాన్ని ఏలిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఘ‌న‌మైన చ‌రిత్రే ఉంది.

ఎప్పుడో 1885లో దేశ స్వాతంత్య్రం కోసం పురుడు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ 1950 దాకా ఎలాంటి చీలిక‌లు లేకుండానే... దేశానికి నాయ‌క‌త్వం వ‌హించింది. 1951లో జేబీ కృప‌లానీ తొలిసారిగా కాంగ్రెస్ పార్టీని చీల్చారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ త‌మ కుటుంబ సొత్తు అన్న చందంగా సాగుతున్న గాంధీ ఫ్యామిలీ కూడా ఈ పార్టీని చీల్చేసింద‌నే చెప్పాలి. దివంగ‌త ప్ర‌ధాని, భార‌త ఉక్కుమ‌హిళ‌గా పేరుగాంచిన ఇందిరా గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీని చీల్చిపారేశారు. అయితే ఆ త‌ర్వాత ఆమె కూడా తిరిగి ఇదే పార్టీలో చేర‌క త‌ప్ప‌లేదు. అయితే ఎన్ని సార్లు కాంగ్రెస్ లో చీలికలు వ‌చ్చినా పెద్ద‌గా ఇబ్బంది రాలేదు గానీ... ఇటీవ‌లి కాలంలో ఆ పార్టీ ఈ త‌ర‌హా చీలిక‌ల ద్వారా కొత్త‌గా పుట్టిన తృణ‌మూల్ కాంగ్రెస్‌, వైఎస్సార్ కాంగ్రెస్‌, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీల పుణ్య‌మా అని చాలా దుర్భ‌ర ప‌రిస్థితుల‌నే ఎదుర్కొంటోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

గ‌తంలో ఎన్న‌డూ లేన్న‌ట్లుగా 2014 ఎన్నిక‌ల్లో క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోలేక కాంగ్రెస్ పార్టీ త‌న ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చుకుంది. ఈ త‌ర‌హా దుర్భ‌ర ప‌రిస్థితికి వైఎస్ జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలోని వైసీపీతో పాటు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్పాలి. బెంగాల్ లో తృణ‌మూల్ కాంగ్రెస్‌... కాంగ్రెస్ కు భారీ దెబ్బ కొట్టేస్తే... ఏపీలో వైసీపీ దెబ్బ‌కు ఆ పార్టీ అస్తిత్వ‌మే ప్ర‌శ్నార్థకంగా మారిపోయింది. 2014 ఎన్నిక‌ల్లో దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏకంగా 464 లోక్ స‌భ స్థానాల్లో పోటి చేసిన కాంగ్రెస్ కేవ‌లం 44 సీట్ల‌ను మాత్ర‌మే గెలుచుకుంది.

అదే స‌మ‌యంలో ప‌శ్చిమ బెంగాల్ లోని 45 సీట్ల‌లో మాత్ర‌మే పోటీ చేసిన తృణ‌మూల్ కాంగ్రెస్ ఏకంగా 34 సీట్ల‌లో విజ‌య‌కేతనం ఎగుర‌వేసింది. ఇక ఏపీ, తెలంగాణ‌ల్లో 38 సీట్ల‌లో పోటీ చేసిన వైసీపీ 9 స్థానాల్లో విజ‌యం సాధిస్తే... ఏపీలో కాంగ్రెస్ కు సింగిల్ సీటు కూడా ద‌క్క‌కుండా చేసింద‌నే చెప్పాలి. ఆయా పార్టీల‌కు పోలైన ఓట్ల శాతాన్ని చూసుకున్నా తృణ‌మూల్, వైసీపీలే కాంగ్రెస్ కంటే ముందుంజ‌లో ఉన్నాయి. ఈ త‌ర‌హా చీలిక‌లు మ‌రో రెండో, మూడో వ‌స్తే.. కాంగ్రెస్ పార్టీ కాల‌గ‌ర్భంలో క‌లిసిపోక త‌ప్ప‌ద‌న్న భావ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నా... ఇప్ప‌టికే 70 చీలిక‌ల‌ను త‌ట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇంకెన్ని చీలిక‌లు వ‌చ్చినా పెద్ద‌గా ఇబ్బందేమీ ఉండ‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English