రిల‌య‌న్స్ వాకిట ర‌విప్ర‌కాశ్!... ప్లాన్ ఇదేనా?

రిల‌య‌న్స్ వాకిట ర‌విప్ర‌కాశ్!... ప్లాన్ ఇదేనా?

తెలుగు ప్రముఖ న్యూస్ ఛానెల్ టీవీ 9 నుంచి చాలా అవమానకరమైన రీతిలో బయటకు వచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాశ్... చాలా పెద్ద ప్లాన్ తోనే కదులుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సక్సెస్ ఫుల్ ఎంట‌ర్ ప్రెన్యూర్ గా త‌న‌ను తాను నిరూపించుకున్న ర‌విప్ర‌కాశ్... టీవీ 9 నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్టినంత మాత్రాన చేతులు ముడుచుకుని కూర్చుంటార‌ని అనుకోలేం క‌దా. ఈ నేప‌థ్యంలో ఐ న్యూస్ ను ఆయ‌న టేకోవ‌ర్ చేస్తార‌ని, దానితో పాటు ఇప్ప‌టికే ప్రారంభించిన మోజో టీవీని మ‌రింతగా యాక్టివేట్ చేస్తార‌ని కూడా అంతా భావించారు.

అయితే ఈ ప్లాన్ కంటే కూడా కొన్ని వంద‌ల రెట్ల మేర భారీ ప్లాన్ ను ర‌విప్ర‌కాశ్ సిద్ధం చేసుకుంటున్న‌ట్లుగా ప్ర‌స్తుతం సంచ‌ల‌న వార్త‌లు వినిపిస్తున్నాయి. టీవీ 9 నుంచి గెంటేయ‌డాన్ని చాలా పెద్ద విషయంగానే ప‌రిగ‌ణించిన రవిప్ర‌కాశ్... సైబ‌ర్ క్రైమ్ పోలీసుల నోటీసుల‌ను చాలా లైట్ గానే తీసుకుని ప్ర‌స్తుతం ముంబైలో ల్యాండైన‌ట్లుగా తెలుస్తోంది. ర‌విప్ర‌కాశ్ ముంబైలో ఉన్నట్లు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కూడా ధృవీకరించిన సంగ‌తి తెలిసిందే. అయినా ముంబైలో ఉండి ర‌విప్ర‌కాశ్ ఏం ప్లాన్ చేస్తున్నార‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు.. ఆ ప్లాన్ ఇలా ఉంది. న్యూస్ 18 తెలుసు క‌దా. రిల‌య‌న్స్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన మీడియా సంస్థ.

తెలుగులో త‌న అదే పేరుతో ఓ న్యూస్ ఛానెల్ ను ఏర్పాటు చేయాల‌ని చాలా కాలం కింద‌టే అనుకున్నారు. కానీ కార‌ణాలేంటో తెలియ‌దు గానీ... అది కార్యరూపం దాల్చ‌లేదు. ఇలాంటి కీల‌క విష‌యాల‌న్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునే ర‌విప్ర‌కాశ్.... న్యూస్ 18 బాధ్య‌త‌ల‌ను భుజానికెత్తుకోవ‌డానికే ముంబై వెళ్లార‌ట‌. న్యూస్ 18కు జాతీయ ఛానెల్ ఇమేజీ ఉంది. ఈ ఇమేజీ ముందు తెలుగులో టాప్ పొజిష‌న్ లో ఉన్న టీవీ9 సాటి రాద‌నే చెప్పాలి. ఓ జాతీయ ఛానెల్ కు చెందిన ప్రాంతీయ భాషా ఛానెల్ ను ర‌విప్ర‌కాశ్ చేజిక్కించుకుంటే... పెను సంచ‌ల‌న‌మేన‌ని చెప్పాలి. ర‌వి ప్రకాశ్ ట్రాక్ రికార్డు చూస్తే... ఒక్క అంబానీనే కాదు... ఏ పారిశ్రామిక‌వేత్త కూడా ఆయ‌న‌ను వ‌దులుకోర‌నే చెప్పాలి. ఈ లెక్క‌లేసుకునే ర‌విప్ర‌కాశ్ ముంబైలో ల్యాండ‌య్యార‌ట‌.

న్యూస్ 18 ఛానెల్ కోస‌మే ఆయ‌న ముంబైలో ల్యాండ‌య్యార‌ని, అయితే అంబానీతో ఆయ‌న ఇప్ప‌టికే భేటీ అయ్యారా?  లేక త్వ‌ర‌లో భేటీ జ‌రుతుందా? అన్న విష‌యం అయితే తేల‌లేదు గానీ... మొత్తంగా ర‌విప్ర‌కాశ్ ప్లాన్ అయితే ఇదేన‌ట‌. చాలా తెలివిగా ర‌విప్ర‌కాశ్ ర‌చించుకున్న ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ర‌విప్ర‌కాశ్ అనుకున్న‌ట్లుగా ఈ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయితే... తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి కూడా లొంగ‌ని ఓ మీడియా సంస్థ ఎంట్రీ ఇచ్చిన‌ట్టుగానే చెప్పాలి. అయితే ఈ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయినా... ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాతే కార్యరూపం దాల్చే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English