కొత్త వ్యాపారంలోకి చిరు...రాజ‌కీయాలకు గుడ్‌బై అన్న‌ట్లేనా?

కొత్త వ్యాపారంలోకి చిరు...రాజ‌కీయాలకు గుడ్‌బై అన్న‌ట్లేనా?

మెగాస్టార్ చిరంజీవి...ఈ పేరు గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సినిమాల్లో ఊహించ‌ని ఎత్తుకు ఎదిగిన అనంత‌రం అడుగిడిన రాజ‌కీయాల్లో అంచ‌నాలు అందుకోలేక‌పోయినా...త‌న ముద్ర వేసుకున్నారు. ఈ ఒర‌వ‌డిలోనే తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. విద్యారంగంలోకి అడుగిడుతున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న ఫ్యాన్స్‌కు తీపిక‌బురు వినిపించారు.

సినిమాల్లో త‌న స‌త్తా చాటుకున్న చిరు దాదాపు దశాబ్దం కిందట చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. 2009 ఎన్నికలను ఎదుర్కొన్నారు. అయితే కేవలం 18 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది ప్రజారాజ్యం పార్టీ. ఆ తర్వాత కొంతకాలానికే వివిధ పరిణామాల మధ్యన చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లోకి విలీనం చేశారు. 2011 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత 2012 ఏప్రిల్‌ 3న రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ  బాధ్యతలు నిర్వహించారు. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడటంతో...చిరంజీవి మంత్రి పదవి కూడా పోయింది. 2104 లోక్‌సభ ఎన్నికల తర్వాత చిరంజీవి పార్లమెంటుకు హాజరుకావడం తగ్గించారు. అడపాడదపా హాజరైనా అదీ మొక్కుబడి తంతుగానే ముగించారు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీ కార్యక్ర‌మాల్లోనూ ఆయ‌న పెద్దగా పాల్గొనడం లేదు. జ‌న‌సేన వైపు ఆయ‌న మొగ్గు చూపుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చినా అది జ‌ర‌గ‌లేదు.

క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న చిరు ఈ క్ర‌మంలో మ‌రో అడుగు వేశారు. మెగా ఫ్యామిలీ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్‌ను చిరంజీవి కుటుంబం ఏర్పాటు చేస్తోంది.  సీఈవో జె శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ఈ మేర‌కు వివ‌రాలు వెల్ల‌డించారు. మెగాస్టార్ చిరంజీవి గౌరవ వ్యవస్థాపకులుగా, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబు గౌరవ చైర్మన్‌గా, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు గౌరవ కన్వీనర్ గా వ్యవహరించనున్నారని వివ‌రించారు. శ్రీకాకుళం నగర శివార్లలోని పెద్దపాడు రోడ్డులో మొదటి చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ ను అన్ని సదుపాయాలతో నెలకొల్పుతున్నట్టు చెప్పారు. అధునాతన సౌకర్యాలు, ఏసీ వసతులతో క్యాంపస్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు ఐజిసిఎస్ఈ, సీబీఎస్ఈలలో తరగతులు నిర్వహిస్తామని సీఈఓ పేర్కొన్నారు. ఏసీ క్లాస్ రూమ్ లు, ఆడియో విజువల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్, సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ, పేరెంట్-టీచర్ ముఖాముఖి, ఇంగ్లిష్ గ్రామర్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలని వివరించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా తరగతులను నిర్వహించనున్నట్టు చెప్పారు. వర్తమాన పోటీ ప్రపంచంలో చిన్నతనం నుంచే విద్యార్థులకు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే సాంకేతిక అంశాలతో పాటు తార్కిక ఆలోచన, విశ్లేషణా సామర్థ్యం, నైపుణ్యాలలో శిక్షణ, సమస్యల పరిష్కారం, కంప్యూటర్స్ లోని ప్రాథమిక, ఆధునిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే విధంగా స్టూడెంట్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఎస్టీఈపీ) ద్వారా అత్యాధునిక శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. ఈ స్కూల్ లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల పిల్లలకి ప్రత్యేక ఫీజు రాయితీలు ఉంటాయని సీఈవో జె శ్రీనివాసరావు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English