కొండా సురేఖ చాప్ట‌ర్ క్లోజేనా...ఈ ఒక్క చాన్సే మిగిలింది

కొండా సురేఖ చాప్ట‌ర్ క్లోజేనా...ఈ ఒక్క చాన్సే మిగిలింది

తెలంగాణ రాజ‌కీయాల్లో ఉన్న మ‌హిళా ఫైర్‌బ్రాండ్ నేత‌ల్లో కొండా సురేఖ ఒక‌రు. పార్టీ ఏదైనా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ డైన‌మిక్‌గా ముందుకు సాగే కొండా సురేఖ‌, ఆమె భ‌ర్త కొండా ముర‌ళీధ‌ర్‌రావు ప్ర‌స్తుతం రాజ‌కీయంగా కీల‌క‌మైన ద‌శ‌లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే...తమ రాజ‌కీయ భ‌విష్య‌త్ క్లోజ్ అవుతుందో లేదో తేల్చుకునే ప‌రిస్థితిలో ఈ ఇద్ద‌రు నేత‌లు ఉన్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌డం, గెలుపొంద‌డం అనేదాన్ని బ‌ట్టే...వారి భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంటుందంటున్నారు. స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఈ ఓరుగ‌ల్లు నేత‌ల‌కు అత్యంత ముఖ్య‌మైన‌వి పేర్కొంటున్నారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న ముంద‌స్తు ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌లో భాగంగా ప్ర‌క‌టించిన 105 మంది అభ్య‌ర్థుల్లో టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ నిరాశ‌కు గురైన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం త‌న టికెట్ ఖ‌రారుకు సురేఖ ప్ర‌య‌త్నించినా...కేసీఆర్ ఆమెను కరుణించలేదు. దీంతో మనస్తాపం చెందిన సురేఖ టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తూ నిప్పులు చెరిగారు. ``ఏ కారణం లేకుండా నాకు టికెట్ ఇవ్వకుండా గెంటేశారు. మంత్రివర్గంలోకి తీసుకోకున్నా సర్దుకుపోయాను . బీసీ మహిళ అయిన నాకు నమ్మకద్రోహం జరిగింది`` అని కొండా సురేఖ ఆవేదన వ్య‌క్తం చేశారు. అనంత‌ర‌రం ఢిల్లీకి వెళ్లి త‌న భ‌ర్త కొండా ముర‌ళితో క‌లిసి కాంగ్రెస్‌లో చేరారు.  పరకాల నుంచి పోటీ చేసిన కొండా సురేఖ టీఆర్ఎస్ అభ్య‌ర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓట‌మి పాల‌య్యారు.

కాగా, ప్ర‌స్తుతం కొండా దంప‌తుల‌కు మ‌రో చాన్స్ క‌లిసివ‌చ్చింద‌ని వారి స‌త్తా చాటుకునే స‌మ‌య‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. స్థానిక సంస్థల కోటాకు సంబంధించి రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ నుంచి మండలికి ఎన్నికైన పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా మురళీధర్‌రావులు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ ఎమ్మెల్సీ స్థానాల‌కు రాజీనామా చేయడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. నరేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో చేరిన కొండా.. ఆ సమయంలోనే తన సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు. దీంతో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌యింది. మే 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు 17వ తేదీ వరకు గడవు ఉంటుంది. మే 31 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. జూన్‌ 3న ఓట్లను లెక్కిస్తారు.

ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ద‌క్కించుకొని....ఎమ్మెల్సీగా ఎన్నికైతే కొండా దంప‌తులు త‌మ ఉనికిని తిరిగి చాటుకోవ‌చ్చ‌ని అంటున్నారు. ఈ ఫైర్‌బ్రాండ్ నేత‌ల ఫ్యూచ‌ర్ ఎలా ఉండ‌నుందో తేలాలంటే...మ‌రికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English