కొత్త వివాదంః హైద‌రాబాద్‌లోని ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌కు నీళ్లు బంద్‌

కొత్త వివాదంః హైద‌రాబాద్‌లోని ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌కు నీళ్లు బంద్‌

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మ‌రో వివాదం తెర‌మీదకు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రెండు రాష్ట్రాల ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ కేంద్రంగా మొద‌లైన చ‌ర్య‌తో మ‌రోమారు ఇరుగు పొరుగు రాష్ట్రాలు క‌య్యానికి కాలుదువ్వే ప‌రిస్థితిని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని ఏపీ సచివాల‌యానికి నీటిని నిలిపివేసేందుకు అధికారులు చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మే ఈ చ‌ర్చ‌కు తెర‌లేపుతోంది. ఏపీ సచివాలయం రూ.3.5కోట్లు బకాయిపడినట్లు అధికారులు గుర్తించి నీటి స‌ర‌ఫ‌రాను నిలిపివేసేందుకు సిద్ధ‌మ‌వ‌డం ఈ వివాదానికి బీజం వేస్తోంది.

విభజన చట్టం ప్రకారం పాత సచివాలయంలోని నాలుగు బ్లాకులు ఏపీకి  కేటాయించారు. 2014 నుంచి ఈ భవనాలను ఏపీ వినియోగిస్తోంది. జలమండలి నీటిని సరఫరా చేస్తుండగా ఏపీ సర్కారు బిల్లులను చెల్లించడం లేదు. ఏపీ జీఏడీ విభాగానికి లేఖలు రాస్తున్నా, ఎలాంటి స్పందన లేదు. దీంతో తాజాగా ఏపీ అధికారులతో సమావేశమై బకాయిలు చెల్లించాలని కోరారు. అయితే, దీనికి ఏపీ అధికారులు స్పందిస్తూ, రెండేళ్లుగా ఆ భవనాల్లో కార్యకలాపాలు సాగించడం లేదని, తామెలా బిల్లులు చెల్లిస్తామని పేర్కొన్నారు. దీంతో నీటి స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తారా అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

జ‌ల‌మండ‌లికి చెందిన డివిజన్ నంబర్–4 పరిధిలో సచివాలయం ఉంది.  నల్లా లైన్ తొలగించాలా లేదా అనే అంశంపై జలమండలి యోచిస్తోంది. పెండింగ్ బిల్లులు చెల్లించని ప్రభుత్వ రంగ సంస్థలకు నల్లా నీటిని తొలగించిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. ఏపీ సచివాలయం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ నల్లా కనెక్షన్ తొలగించినా ఏపీ నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా బకాయిల రికవరీపై నిర్ణయం తీసుకుంటార‌ని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English