రేవంత్ రెడ్డి కూతురి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

రేవంత్ రెడ్డి కూతురి ప్రయత్నాలు ఫలిస్తాయా..?

ప్రస్తుత తరంలోని నాయకుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే పవర్‌ఫుల్ లీడర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆయన.. ఆ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరడం.. టీఆర్ఎస్‌పై పోరాటం చేయడం వంటి వాటితో రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యారు. కానీ, ముందస్తు ఎన్నికల్లో ఊహించని రీతిలో ఆయన పరాజయం పాలవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి రేవంత్ మీడియా ముందుకు వచ్చింది కూడా తక్కువే. దీంతో రేవంత్ ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపిస్తారో లేదోనన్న అనుమానాలు కూడా కలిగాయి. సరిగ్గా ఆ సమయంలోనే ఆయన లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచి, ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు.

 అసెంబ్లీ ఎన్నికల ఓటమి.. కీలక నేతల వలసలు.. రాష్ట్రంలో బలహీనంగా మారడం వంటి కారణాలతో లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసమే ఈ ఎన్నికల్లో కొత్త వారిని కాదని సీనియర్లనే పోటీ చేయమంది. ఇందులో భాగంగానే భారతదేశంలోనే పెద్దదైన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి రేవంత్‌ రెడ్డిని పోటీలో ఉంచింది. ముందస్తు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన లోక్‌సభ బరిలో నిలవడంతో మల్కాజిగిరిలో రాజకీయం రసవత్తరంగా సాగింది. ఎన్నికల్లో పోటీ చేయడం కన్ఫార్మ్ అయిన తర్వాత రేవంత్ ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల నేతలతో సమావేశమవడం, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీల మద్దతు కూడగట్టేందుకు వారితో మంతనాలు జరపడం వంటివి చేశారు.

 అదే సమయంలో ఆయన కుమార్తె నైమిషారెడ్డి కూడా తండ్రి విజయం కోసం ఎంతగానో శ్రమించారు. ఒకవైపు రేవంత్ ప్రచారం నిర్వహిస్తుంటే.. నైమిషా మాత్రం కొత్త తరహా ప్రణాళికతో ముందుకెళ్లారు. రేవంత్‌ అభిమానుల్లో యాక్టివ్‌గా ఉండే కుర్రాళ్లను ఒక దగ్గరకు చేర్చి పలు కార్యక్రమాలు నిర్వహించారు. వీళ్లతోనే హైదరాబాద్ మెట్రోలో రేవంత్‌ మాస్క్‌లతో ప్రచారం నిర్వహించారు. ఇది అప్పట్లో దేశంలోనే హాట్ టాపిక్‌గా నిలిచింది. అంతేకాదు, కాంగ్రెస్‌ చేపట్టిన కార్యక్రమాలను వివరించే పాటలు పాడుతూ వాళ్లంతా నగరంలోని ప్రధాన సర్కిళ్లలో నృత్యాలు చేశారు. ఇవే కాదు.. ఈ సారి తండ్రిని ఎలాగైనా గెలిపించాలన్న పట్టుదలతో ఆమె ఎంతో కష్టపడ్డారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆమె ఓటింగ్ సరళిపై సమీక్షలు చేశారు. బూత్‌ల వారీగా పోలింగ్‌ వివరాలు తెప్పించుకుని లెక్కలు వేస్తున్నారు. మరి నైమిషారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా..? లేదా..? తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English